సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తొలి విడతగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల జాబితాను గురువారం.. బీఆర్‌ఎస్ విడుదల చేసింది. పార్టీ ఇంచార్జ్‌లతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో కేటీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉందన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ పైన పార్టీ ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇంచార్జ్‌లకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment