మాజీ మంత్రి గొల్లపల్లి రాజీనామాతో కోనసీమ టీడీపీలో కష్టాలు
పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న ఉండి శివరామరాజు
అదే దారిలో పయనించనున్న మండలి బుద్ధప్రసాద్
ప్రత్యామ్నాయం చూసుకుంటున్న బూరగడ్డ వేదవ్యాస్
తుది నిర్ణయం తీసుకుంటానన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని
ఐవీఆర్‌ఎస్ సర్వేపై అనంతలో వెల్లువెత్తిన నిరసనలు
ఫలించని చంద్రబాబు బుజ్జగింపులు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం/మడకశిర/ఉదయగిరి: టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ముఖ్య నాయకులు ఆ పార్టీని వీడిపోగా మరికొందరు అదే బాటలో ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తమవడంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థిత్వాలకోసం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్ సర్వే పార్టీలో మంటలు రేపుతున్నాయి.
కోనసీమలో గొల్లపల్లి రాజీనామా ప్రభావం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు తనను అవమానించారని, రాజోలు సీటు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రభావం రాబోయే ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలో కీలక ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ) కూడా కొద్దిరోజులుగా అధినేతపై తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి సీటు ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తానేంటో ఈ ఎన్నికల్లో టీడీపీకి చూపిస్తానని, ప్రజాక్షేత్రంలో తన సత్తా చూపిస్తానని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఆయన టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
పార్టీ వీడనున్న ముఖ్యనేతలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో తన పేరు కనిపించకపోవడం చాలా సంతోషంగా ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీని వదిలేయాలని ఆయనపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన కూడా అందుకు సిద్ధమవుతున్నారు.
ఇక పెడన సీటును కాగిత కృష్ణప్రసాద్‌కి కేటాయించడంతో టీడీపీ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా టీడీపీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తమకు సీట్లు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరగా, నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా అదే బాటలో ఉన్నారు.
‘సర్వే’ అస్త్రం... బాబు తత్వం...
ఏళ్ల తరబడి జెండాలు మోసేవారికి... కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నవారికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్నది ఆ పార్టీ నేతల ఆవేదన. అభ్యర్థిత్వాలను ఖరారు చేసేటపుడు నచ్చనివారిని తప్పించేందుకు సీనియర్లని కూడా చూడకుండా ఐవీఆర్‌ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) పేరుతో గందరగోళానికి గురిచేస్తున్నారనీ... డబ్బు పెట్టగలిగే కాంట్రాక్టర్లను ఖరారు చేసే విషయంలో ఇదేమీ పట్టించుకోవడంలేదని వారంతా వాపోతున్నారు.
మొన్నటి వరకూ వ్యూహకర్త రాబిన్‌శర్మ రిపోర్టులో మీ పరిస్థితి బాగో లేదని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఐవీఆర్‌ఎస్ పేరుతో తమను తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తొమ్మిది చోట్ల ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత రావడంతో మిగిలిన ఐదు స్థానాల్లో ఇప్పటికిప్పుడు సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం కావాలా, బి.కె.పార్థసారథి కావాలా అని అడిగారు.
పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి కావాలా, వేణుగోపాల్ కావాలా అని అడిగారు. ఈ వాయిస్ రెస్పాన్స్ సిస్టం సర్వేలో వచ్చిన మెజారిటీని బట్టి అభ్యర్థులను నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీనిపై ఆ పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కల్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబుకు ఇచ్చినపుడు ఏ సర్వే నిర్వహించారని వారు నిలదీస్తున్నారు. డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తామంటే ఇక పార్టీ ఎందుకు? ప్రజలు ఎందుకు? అంటూ కొంతమంది నేతలు తమ అనుచరుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిస్తుండటం చూస్తే ఇక్కడ వ్యతిరేకత ఎంతలా ఉందో అర్థమవుతోంది.
రాజీనామాపై నేడు బొల్లినేని నిర్ణయం
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు రాజీనామా బాటలో పయనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పలుకుబడిన కలిగిన ఆయన చంద్రబాబు చిక్కుల్లో ఉన్నప్పుడు ఎంతగానో సహాయపడ్డారు. ఉదయగిరిలో 2012లో బొల్లినేని ఉదయగిరి టీడీపీలోకి వచ్చి 2012 ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై పోటీచేసి పరాజయం చెందారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆర్థికంగా దెబ్బతిన్నారు.
తాను టీడీపీలో చేరకముందు మహారాష్ట్రలో చేసిన పలు కాంట్రాక్టు పనులకు సంబంధించి అవినీతి కేసుల్లో ఇరుక్కున్నా.. అధినేత తనకు సహాయపడలేదని పలుమార్లు అనుచరుల వద్ద వాపోయారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా అధినేత మాట కాదనలేక పోటీచేసి పరాజయం చెందారు. తీరా ఈసారి టికెట్టు ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కు ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. బొల్లినేనికి చెక్‌పెట్టే ఆలోచనలో చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ముందుగా పార్టీ వద్ద రూ.30 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టినట్లు సమాచారం.
నగదు డిపాజట్ చేయడంలో ఆలస్యం జరగడంతో కాకర్లకు టికెట్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత వైఖరికి తీవ్ర మనస్తాపం చెందిన బొల్లినేని కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అనుచరుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
సునీల్ మాకొద్దు ‘బాబో’య్
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్‌కుమార్‌కు కేటాయించడాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం మడకశిరలో ఆ వర్గానికి చెందిన ముఖ్య నాయకులంతా విలేకరుల సమావేశం నిర్వహించి సునీల్‌కుమార్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని తేల్చి చెప్పారు. ఆయన్ను మార్చకుంటే పార్టీకి రాజీనామా చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment