సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దశాబ్ధి దగా పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక, కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించింది. ఈ సందర్బంగా కేసీఆర్ విస్మరించిన ప్రధానమైన 10 హామీలను కాంగ్రెస్ హైలెట్ చేసింది. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్, కొన్ని చోట్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్ది స్పందించారు. ఈ క్రమంలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం. దశాబ్ధి పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కచ్చితంగా దశాబ్ధి దగానే. కేసీఆర్ ఒక్క హామీనైనా పూర్తిగా అమలు చేశారా?. కేసీఆర్ మోసాలను మేము ప్రశ్నిస్తే అరెస్ట్‌లా? అని ప్రశ్నించారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్‌ఎస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల హక్కులను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు దుర్మార్గం. అరెస్ట్ చేసిన నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలి. కేసీఆర్ ఒక్క హామీనైనా నెరవేర్చారా?. తెలంగాణ అమరవీరులను సీఎం కేసీఆర్ మరచిపోయారు. తొమ్మిదన్నరేళ్ల తర్వాత మీకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గుర్తుకొచ్చారా?. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ తన పక్కన పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు చేస్తారా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో ప్రియాంక గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీని తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటించాలని కోరాను. ప్రియాంకను తెలంగాణలో ఎంపీగా పోటీ చేయాలని కోరతాం. తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు విడిచి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం?
Comments
Please login to add a commentAdd a comment