టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి | Revanth Reddy Appointed As Telangana PCC President | Sakshi
Sakshi News home page

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

Published Sat, Jun 26 2021 8:12 PM | Last Updated on Sun, Jun 27 2021 3:02 AM

Revanth Reddy Appointed As Telangana PCC President - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కూర్పులో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్‌ అధిష్టానం తెరదించింది. మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. మరో ఐదుగురిని వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్‌ల సేవల పట్ల పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం నియామకం కోసం కాంగ్రెస్‌ అధిష్టానం గత ఏడాది డిసెంబర్‌లోనే కసరత్తు మొదలుపెట్టింది. అదే నెలలో ఏఐసీసీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 162 మంది నాయకుల అభిప్రాయాలను సేకరించింది. సామాజిక సమీకరణాలు, పార్టీలో ఇతర నాయకులను కలుపుకొని పోవడం, పార్టీ విధేయత, పలు ఇతర అంశాల ఆధారంగా.. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్‌బాబుల పేర్లను ఏఐసీసీ పెద్దలు షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అధ్యక్ష పదవితోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ఇతర కీలక కమిటీలు, పోస్టులకు ఎంపికపై చర్చించారు. జనవరి తొలివారంలోనే ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయి, ప్రకటనే తరువాయి అనుకున్న సమయంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కారణంగా వాయిదా పడింది. తిరిగి ఈ నెల 18న కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా తుది జాబితాకు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేశారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి
కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరిగి బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 589 మండలాలకు ప్రస్తుతమున్న అధ్యక్షులను కొనసాగించాలా లేక కొత్తవారిని నియమించాలా అన్నదానిపై గతంలోనే సమాలోచనలు జరిగాయి. ఈ విషయం తేలాక జిల్లాస్థాయి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈసారి సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక నియామకాలు జరగనున్నాయని తెలిసింది.

సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు
1. సంభాని చంద్రశేఖర్‌
2. దామోదర్‌రెడ్డి
3. మల్లు రవి
4. పొదెం వీరయ్య
5. సురేశ్‌ షెట్కార్‌
6. వేం నరేందర్‌రెడ్డి
7. రమేశ్‌ ముదిరాజ్‌
8. గోపిశెట్టి నిరంజన్‌
9. టి.కుమార్‌రావు
10. జావీద్‌ అమీర్‌

ప్రచార కమిటీ
1. మధుయాష్కీ గౌడ్‌ – చైర్మన్‌
2. సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ – కన్వీనర్‌

ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ
దామోదర రాజనర్సింహ – చైర్మన్‌

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ
అల్లేటి మహేశ్వర్‌రెడ్డి – చైర్మన్‌  

చదవండి: తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement