సొంత నియోజకవర్గంలో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్న సీఎం రేవంత్
ఈ నెలలో ఇప్పటికే 5 సార్లు పర్యటన..
స్థానిక ఎమ్మెల్యేలకు వరాలు.. కార్పొరేషన్ పదవులు ఇస్తానని హామీ?
తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారంటూ సానుభూతి పొందే యత్నం కూడా..
సాక్షి, హైదరాబాద్: పాలమూరు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో విజయం కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో పోటాపోటీ ఉండొచ్చన్న సర్వేల అంచనాలే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వరుస పర్యటనలు, అక్కడి నాయకులు, ప్రజలకు ఇస్తున్న హామీలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ట్ర, జిల్లా రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తున్నారని.. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
వీలైనప్పుడల్లా పర్యటిస్తూ..
రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాపై రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు లోక్‌సభ ఎన్నికపైనా దృష్టిపెట్టారు. అటు అధిష్టానానికి, ఇటు తనకు సన్నిహితుడైన వంశీచంద్‌రెడ్డికి లోక్‌సభ టికెట్ ఇప్పించారు. అధికారికంగా టికెట్ ప్రకటించకముందు, తర్వాత చాలాసార్లు వంశీతో భేటీ అయి ప్రచారం, ఇతర అంశాలపై వ్యూహాలను సిద్ధం చేశారు. అంతేకాదు వీలైనప్పుడల్లా మహబూబ్‌నగర్ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్‌నగర్‌కు వెళ్లిన రేవంత్.. రెండు సభల్లో పాల్గొన్నారు.
రెండుసార్లు కొడంగల్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లింది మూడే సార్లు కావడం గమనార్హం. తాజా సభల్లో, కార్యక్రమాల్లో రేవంత్ మాట్లాడుతున్న తీరు కూడా పాలమూరులో గెలుపే లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని.. 70ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచి్చందని.. పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ చెప్తున్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం మంజూరు, వాల్మికి బోయ కులస్తులతో భేటీ అయి హామీలివ్వడం ద్వారా ఓటర్లను ఆకర్షించే వ్యూహాలను అమలు చేశారు.
మ్మెల్యేలకు ‘స్పెషల్’గా హామీలిస్తూ..
పాలమూరులో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని.. ఇందుకోసం ఆ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోభాగంగానే మహబూబ్‌నగర్ సభ వేదికగా ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పింస్తామని ప్రకటించారని అంటున్నాయి. నియోజకవర్గాల వారీగా మంచి మెజార్టీ తీసుకురావాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment