సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇక, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రెండు నెలలు ఓపిక పట్టండి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని సీరియస్ అయ్యారు. అలాగే, డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్ గద్దె దిగాలి. 32 లక్షల మంది యువత ఆందోళనలో ఉన్నారు.
జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా?. సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల రద్దుతో అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. జరిగిన పరిణామాలకు టీఎస్‌పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరో విధంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థిని రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణం స్పష్టంగా పేర్కొంది. చనిపోయిన విద్యార్థినిపై అబాండాలు వేయడం సరికాదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రవల్లిక మృతిపై డీసీపీ వెంకటేశ్వర్లు సంచలన కామెంట్స్ చేశారు. ప్రవల్లిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్నారు. ఆమె 15 రోజుల కిందటే హాస్టల్‌లో చేరింది. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్‌లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది తెలిపారు. శివరామ్‌తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. రేపే కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment