సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టారో, ఎంతమంది బినామీ బిల్డర్లతో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన బిల్డర్లపై చదరపు గజానికి రూ.50 చొప్పున పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ విధిస్తోందని, ఆ డబ్బులన్నింటినీ తెలంగాణకు తరలించాలని చూస్తోందని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు రేవంత్ ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలిజ్వరం పట్టుకుంటే, కొడుకు పూర్తిగా మతి తప్పి మాట్లాడుతున్నారని, నిండా అవినీతిలో మునిగి నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే బీఆర్‌ఎస్ నేతలు, కాంగ్రెస్ గురించి మాట్లాడతారా అని రేవంత్ రీట్వీట్ చేశారు.
పక్క రాష్ట్రం గురించిన మాటలను పక్కనపెడితే తెలంగాణలోని కల్వకుంట్ల ‘స్కామిలీ’గురించి చెప్పాలని, దళితబంధులో 30 శాతం కమీషన్ల గురించి, లిక్కర్‌స్కామ్‌లో కవిత వెనుకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న రూ.300 కోట్ల ఆరోపణల గురించి, భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడం లేదని కాగ్ కడిగేసిన విషయాల గురించి చెప్పాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం కేటీఆర్ వల్ల కాదని ఆ ట్వీట్‌లో రేవంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment