ముహమ్మద్ ఫసియొద్దీన్ : రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో యువ ఓటర్లు నిర్ణయాత్మకంగా మారబోతున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించబోతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే యువ ఓటర్ల నాడి పట్టి వారి మనస్సులను గెలుచుకోకతప్పని పరిస్థితి నెలకొంది. నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సర్కారీ కొలువుల భర్తీ, నిరుద్యోగ సమస్యలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలుగా మారబోతున్నాయి.
అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ప్రత్యేక హామీలు ఇవ్వక తప్పని స్థితి. యువతే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే, నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఓటేయబోతున్న వారిలో ఏకంగా 50.44 శాతం మంది 18–39 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నవ యువ ఓటర్లు, యువ ఓటర్లు, ఇప్పుడిప్పుడే మధ్య వయస్సులోకి అడుగిడుతున్న ఓటర్లుండడం గమనార్హం.
ఓటర్లలో సగభాగం యువతే
శాసనసభ సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 4న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్‌లవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389కు పెరగగా, అందులో 1,59,98,116 (50.44%) మంది 19–39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లే ఉన్నారు. అందులోనూ 91,46,484 (28.84%) మంది మధ్య వయస్సులో అడుగుపెట్టిన 30–39 ఏళ్ల ఓటర్లే కావడం గమనార్హం. తొలిసారిగా ఓటు పొందిన 18–19 ఏళ్ల నవ యువ ఓటర్లు 8,11,640 (2.56%) ఉండగా, 20–29 ఏళ్ల నిడివి గల ఓటర్లు గణనీయంగా 60,39,992 (19.04%) మంది ఉన్నారు.
గతంతో పోలిస్తే 5% తగ్గిన యువ ఓటర్లు...
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18–39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 55.4 శాతం ఉండగా, తాజా జరగనున్న ఎన్నికల్లో 50.44 శాతం ఉన్నారు. అప్పట్లో 20–29 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 24.84శాతం ఉండగా, ఇప్పుడు 19.04 శాతానికి తగ్గడమే ఇందుకు కారణం. స్థూలంగా చూస్తే గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి యువ ఓటర్లు 5శాతం తగ్గినా .. ఫలితాల్లో మాత్రం నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థితిలోనే ఉండడం గమనార్హం.
2018లో 50–59 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 12.73 శాతం ఉండగా, ఇప్పుడు 14.24 శాతానికి పెరిగారు. నాటితో పోల్చితే ఇప్పటి ఓటర్ల జాబితాలో మిగిలిన ఏజ్ గ్రూపుల ఓటర్ల శాతాల్లో స్వల్ప తేడాలే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 60 ఏళ్లుకు పైబడిన ఓటర్లు 45,96,051 (14.5శాతం) మంది ఉండగా, 40–50 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 20.83 శాతం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment