
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఒకటి రెండు రోజుల్లో గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నిర్వహించిన చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ బ్యానర్లలో బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ విజయలక్ష్మి ఫొటో ప్రత్యక్షం కావడంతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశం బీజేపీ, బీఆర్‌ఎస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సాక్షి ఆరా తీయగా అనేక విషయాలు తేటతెల్లమయ్యాయి.
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, రాంనగర్ డివిజన్ అధ్యక్షురాలిగా, డెంటల్ డాక్టర్‌గా అందరికీ పరిచయమున్న డాక్టర్ విజయలక్ష్మి త్వరలోనే ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో ఒకటి రెండు సార్లు సమావేశమై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం కేరళలో ఉన్న కవిత హైదరాబాద్ రాగానే ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయలక్ష్మి పార్టీని వీడడానికి గల కారణాలపై ఆరా తీయగా.. రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు వీడి మూడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
పార్టీ పట్టించుకోవడం లేదనే..
తనకు ఏదైనా బాధ్యత అప్పగించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుమార్లు కలిసినప్పటికీ ఫలితం లేకపోవడమే ఆమె అలకకు కారణంగా తెలిసింది. దీంతో పాటు ఆమె ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడి వద్ద బాదం పాలను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. దీనికి బీజేపీ నాయకుల నుంచి సహకారం అడిగినా స్పందన కరువైనట్లు సమాచారం.
పార్టీ కార్యక్రమాలకు సైతం తనను పిలవడం లేదని, బతుకమ్మ సంబరాలు, బీజేపీ సంస్థాగత సమావేశాలకు సైతం ఆహ్వానం అందడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత ముషీరాబాద్ బీజేపీలో ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, కన్వీనర్‌గా రమేష్‌రాం రెండవసారి ఎన్నికైన తరువాత ఈ పరిస్థితి మారదని భావించే తాను బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆమె సాక్షికి వివరించారు. తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్న విషయం బయటకు రావడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు ఫోన్ చేసి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారని, ఇప్పటి వరకు వారంతా ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా?
Comments
Please login to add a commentAdd a comment