
గహ్లోత్ గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తదుపరి ఎన్నికల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. అప్పటి ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో గెలుపొందాం.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో చర్చించిన తర్వాత రెబల్ నేత సచిన్ పైలట్ కాస్త శాంతించారు. తన ఫిర్యాదులపై అధిష్టానం సానుకూలంగా స్పందించడంతో తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అంతేగాక పైలట్ వర్గం లేవనెత్తిన పరిష్కారాలు చూపేందుకు పార్టీ అధ్యక్షురాలు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్ ప్రభుత్వం బలనిరూపణకు తిరుగుబాటు నేతలు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి భంగపడి.. డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్న సచిన్ పైలట్‌కు సోమవారం నాటి చర్చల్లో గాంధీ కుటుంబం ఎటువంటి హామీలు ఇచ్చి సంక్షోభాన్ని చల్లార్చిందనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అధిష్టానంతో రాజీ ఫార్ములా కుదిరిన నేపథ్యంలో.. సీఎం అశోక్ గహ్లోత్‌తో తీవ్ర విభేదాలు నెలకొన్నప్పటికీ పైలట్ మళ్లీ ఆయనతో కలిసి పనిచేస్తారా? లేదా దేశ రాజకీయాలపై దృష్టి సారించి పార్టీ వ్యవహరాల్లో కీలకంగా మారుతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ‘‘నేను కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఢిల్లీలో ఉన్నాను. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయినపుడు జైపూర్‌లో ఉన్నాను. పార్టీ నిర్ణయంపైనే నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ అధిష్టానం చెప్పినట్లే తాను నడచుకుంటానని పేర్కొన్నారు. అదే సమయంలో.. తాను టోంక్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, అక్కడి ప్రజలకు జవాబుదారీగా ఉండటం తన బాధ్యత అంటూ సొంత రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. (సొంత గూటికి పైలట్!)
ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పైలట్‌ను చూడవచ్చా అని ప్రశ్నించగా.. ‘‘గహ్లోత్ గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తదుపరి ఎన్నికల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. అప్పటి ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో గెలుపొందాం. నేను పార్టీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టే సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు రాకుండా ఉండాలంటే పదునైన వ్యూహంతో ముందుకు సాగాల్సి ఉంటుంది కదా’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (రాజీ ఫార్ములాపై రాహుల్, పైలట్ మంతనాలు)
కాగా 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత 2014 జనవరిలో సచిన్ పైలట్‌ను రాజస్తాన్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఈ క్రమంలో ఐదేళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి విస్తృత ప్రచారం చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 99 స్థానాల్లో గెలుపొందడంలో పైలట్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ సుదీర్ఘ పాలనతో విసుగెత్తి పోయిన ప్రజలను కాంగ్రెస్ వైపునకు తీసుకురావడంలో ఈ యువనేత సఫలీకృతడయ్యాడంటూ ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడమే తరువాయి అన్న తరుణంలో అధిష్టానం సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వైపు మొగ్గుచూపడంతో పైలట్‌కు నిరాశే ఎదురైంది. డిప్యూటీ సీఎం పదవి దక్కినప్పటికీ గహ్లోత్ పాలనా తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలో గత నెల 12న తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. (గహ్లోత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు : సచిన్)
ఆ విషయం నన్ను బాధించింది..
ఇక తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. తమ మధ్య గత 18 నెలలుగా మాటలు లేవని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని, కాబట్టి అటువైపు నుంచి స్పందన లేకపోవడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనా తాను ఏనాడు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లినపుడు కూడా ఇదే పంథా అనుసరించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా తాను ఎప్పుడూ ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నానని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) చేత ప్రభుత్వం (దేశ ద్రోహం కింద) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తనను వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.
కాగా రాహుల్ గాంధీ, ప్రియాంక భేటీతో అనంతరం సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) పెట్టిన దేశద్రోహం కేసు, రాష్ట్రంలో పాలన తీరు సహా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను భేటీలో లేవనెత్తాను. వాటిని సమయానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొందరు నాపై కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాజకీయాల్లో బురదజల్లే వ్యవహార శైలికి నేను వ్యతిరేకం’ అని పైలట్ పేర్కొన్న విషయం తెలిసిందే.