బీజేపీ తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కకుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. దానికి నిదర్శనమే తొలిజాబితా. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన వారికి బీజేపీ ఈసారి మొండి చేయి చూపింది. అటువంటి వారిలో ఒకరు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్.
ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాన్ని అలోక్ శర్మకు కేటాయించింది. అయితే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ టికెట్ రాకపోవటానికి కారణమని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ తనకు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంపై స్పందించారు.
‘గతంలో నేను టికెట్ కోరలేదు.. ఇప్పడూ కూడా నేను లోక్‌సభ టికెట్ కోరటం లేదు. గతంలోనే నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రధాని మోదీకి నచ్చలేదు. నా వ్యాఖ్యలపై ప్రధాని.. నేను ఎప్పటికీ పూర్తి స్థాయిలో క్షమించబడనని అన్నారు. ఏదేమైనా నేను క్షమాపణలు కూడా చెప్పాను’ అని సాధ్వీ ఆదివారం మీడియాకు వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్‌పై 3,64, 822 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇక.. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించటం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించిదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment