
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు కురిపించారు. విమర్శలను ఎలా ఎదుర్కొవాలో తెలిసిన ధైర్యవంతమైన రాజకీయ నాయకుడని కొనియాడారు. అలాంటి ధైర్యవంతులైన, నిజాయితీ కలిగిన నేతలంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. వీరిలో ఎవరూ ధైర్యవంతులని, ఎవరు భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మీరు భావిస్తున్నట్లు అడగ్గా.. ముగ్గురూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులేనని అన్నారు. అయితే గతంలో రాహుల్‌పై వచ్చిన విమర్శలను ఆయన ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని తెలిపారు.
చదవండి: మోదీని కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ
‘రాహుల్‌గాంధీ తీరు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. చాలా కష్టపడి తన పనుల ద్వారా విమర్శలను తిప్పికొట్టాడు. మళ్లీ ప్రజల్లో ఆదరణ చూరగొన్నారు. ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని సైఫ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాను రాజకీయ నాయకుడిని కాదని, భవిష్యత్తులోనూరాజకీయాల్లో చేరాలనుకోవడం లేదని పైఫ్ తెలిపారు. అలాగే ఎవరికి మద్దతిస్తానన్న నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం చెప్పలేననని పేర్కొన్నారు.అయితే తనకు ఏదైనా విషయంలో బలమైన అభిప్రాయాలు ఉంటే కచ్చితంగా వాటిని అందరితో పంచుకుంటానని చెప్పారు. అలాగే భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని, అది ఇంకా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు
Comments
Please login to add a commentAdd a comment