విగ్రహాల కూల్చివేతకు బాబు కుట్ర  | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

విగ్రహాల కూల్చివేతకు బాబు కుట్ర 

Published Wed, Feb 3 2021 4:05 AM | Last Updated on Wed, Feb 3 2021 9:20 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహం రూపొందించాడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంబేడ్కర్, వంగవీటి మోహన్‌ రంగా విగ్రహాల ధ్వంసానికి పథక రచన చేశారని, ఈ మేరకు తన కార్యకర్తలకు చంద్రబాబు ఇప్పటికే సందేశాలు కూడా పంపారని చెప్పారు. ఈ కుట్ర పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఊళ్లోనే ప్రజాస్వామ్యం లేకపోవడం విడ్డూరమన్నారు. పోటీకొస్తే హత్యలకు తెగించిన చరిత్ర టీడీపీదేనన్నారు. ఎస్‌ఈసీ తీసుకొచ్చే యాప్‌పై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

విగ్రహాల కుట్రకు చంద్రబాబు స్కెచ్‌ 
► రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అరాచకాలకు చంద్రబాబు కుట్ర పన్నారు. అంబేడ్కర్, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వంసం చేసి, ఆ నేరాన్ని వైఎస్సార్‌సీపీ వాళ్లపై వెయ్యండని తన కేడర్‌కు సందేశాలు పంపారు. ఈ రెండు విగ్రహాలు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ మాటలు చంద్రబాబు తనకు దగ్గర వాళ్లతో అన్నారని, ఇది కింది స్థాయికి వెళ్లిందని మాకు కచ్చితమైన సమాచారం ఉంది.  
► ఇలాంటి కుట్రలు అమలు చేయగల సమర్థుడు చంద్రబాబు. దాన్ని మీడియాలోకి తెచ్చి ప్రచారం చేసే యంత్రాంగమూ ఉంది. న్యాయ వ్యవస్థలో పెట్టి లాగే లాయర్లూ ఆయనకు ఉన్నారు. కులాల మధ్య, ఎస్సీలు కాపులకు మధ్య గొడవలు పెట్టే పథకం వేస్తున్నాడు. కాబట్టి పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  
► ఈ మధ్య దేవాలయాల్లో జరిగిన దాడుల వెనుక టీడీపీ వాళ్ల ప్రమేయం ఉందన్న మా అనుమానాలే నిజమయ్యాయి.  
అచ్చెన్న ఊళ్లో ప్రజాస్వామ్యం ఖూనీ 
► చంద్రబాబు నాయుడు చెప్పే ప్రజాస్వామ్యం టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో ఎందుకు లేదు? పోటీకి సిద్ధమైన వ్యక్తిపై ఎందుకు బెదిరింపులకు దిగి దౌర్జన్యం చేశారు? చంద్రబాబు సమాధానం చెప్పాలి.  
► మూడు దశాబ్దాల్లో అచ్చెన్నాయుడి కుటుంబాన్ని ప్రశ్నించిన ఎనిమిది మంది వరకూ హత్యలకు గురయ్యారు. ఒక మహిళను వివస్త్రను చేసిన ఉదంతం ఉంది. 
► ఎన్టీఆర్‌ హయాంలో రేణుకా చౌదరి వస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇదీ వైఎస్‌ కుటుంబ నేపథ్యం. టీడీపీ వాళ్లు ఒక్కరూ లేని చోట ఏకగ్రీవం జరగడం సర్వసాధారణం. దీన్ని అధికార పార్టీ ఏదో చేస్తుందని చంద్రబాబు, నిమ్మగడ్డ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 
► అభ్యర్థి భర్త చనిపోయిన చోటుకెళ్లి, రకరకాలుగా మాట్లాడి, ఎస్‌ఐ, సీఐని సస్పెండ్‌ చేసిన నిమ్మగడ్డ.. అచ్చెన్నాయుడు దౌర్జన్యం చేసిన నిమ్మాడకు ఎందుకెళ్లలేదు?

మాకొద్దీ యాప్‌ 
నిమ్మగడ్డ తీరును చూసిన తర్వాత ఎస్‌ఈసీ యాప్‌ను నమ్మే పరిస్థితి లేదు. పార్టీ తరఫున మేమూ ఓ యాప్‌ తయారు చేశాం. ఎన్నికల్లో టీడీపీ వాళ్లు దౌర్జన్యం చేసినా, ప్రలోభపెట్టినా ఆ ఫోటోలు తీసి పంపాలని కార్యకర్తలకు చెప్పాం. వాటిని ఎన్నికల కమిషన్‌కు పంపుతాం. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా లేని కారణంగానే మా ఏర్పాట్లు మేం చేసుకున్నాం.

 ఆ దాడి చంద్రబాబు పనేనా? 
► విజయవాడలో టీడీపీ నేతపై జరిగిన దాడి ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇది పిరికిపందల చర్య. భౌతిక దాడులను జగన్‌ పాలన ఎంతమాత్రం ఒప్పుకోదు. దాడి జరిగిన నేత వద్దకెళ్లి చంద్రబాబు మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. అసలు ఇదంతా వాళ్లే చేసుకుని డ్రామాలాడుతున్నారా.. అనే అనుమానం వస్తోంది.  
► అచ్చెన్నాయుడి అరెస్టును పక్కదారి పట్టించడానికి దీన్ని తెరపైకి తెచ్చారా? ఏదైనా సృష్టించి, దాన్ని ప్రచారం చేయడం చంద్రబాబు నైజం. గతంలో ఎన్టీఆర్ ‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై దాడి చేసిన మల్లెల బాబ్జీ ఉదంతం గుర్తుకొస్తోంది. ఉద్యమం జరిగితే రెండు బస్సులైనా తగలబడకపోతే ఎట్లా అన్న చంద్రబాబు తీరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాశారు. ఇలాంటి నీచ ఆలోచనలు ఆయనకు పుట్టుకతోనే ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement