సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వక్రీకరిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌పీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చి, వాస్తవాలు వెలికి తీయాలని కోరారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు తమ్ముళ్లను భ్రమల్లో పెట్టేందుకే చంద్రబాబు చిందులేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ పాలనే ఉండాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నట్టుగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా రెండేళ్లుగా ఆయన అందించిన పాలనకు తగ్గట్టుగానే పంచాయతీ ఫలితాలొచ్చాయని చెప్పారు. ‘మొత్తం 3,325 పంచాయతీలకు ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ అభిమానులు 2,613 స్థానాల్లో గెలిస్తే.. రెబల్స్ 36మంది గెలిచారు. మొత్తం 2,649 మంది సర్పంచ్‌లుగా గెలిచారు. టీడీపీ 538, బీజేపీ 5, జనసేన 35.. ఇతరులు 98 గెలుచుకున్నారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ మద్దతుదారులను చిత్తుచిత్తుగా ఓడించారు’ అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
శ్రుతి మించిన టీడీపీ బరితెగింపు
► టీడీపీకే 38 శాతం పంచాయతీలొచ్చాయని చంద్రబాబు మళ్లీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆఖరుకు ఎన్నికల ఫలితాల కోసం వైఎస్సార్‌సీపీ పెట్టిన వెబ్‌సైట్‌కు నకిలీ వెబ్‌సైట్ సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభిమానుల గెలుపును తక్కువ చేసి చూపేందుకు దీన్ని వాడుకున్నారు.
► పైగా ఇందులో వెకిలిగా కామెంట్స్ పెట్టారు. ఇంత నీతిమాలిన, అసహ్యకర, బరితెగింపునకు టీడీపీ పాల్పడుతుందని అనుకోలేదు. నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
నిజాలేంటో మీడియా నిగ్గు తేల్చాలి
► చంద్రబాబు ఫలితాల వక్రీకరణకు రెండు పత్రికలు, చానళ్లు వంత పాడుతున్నాయి. వాళ్లు చెప్పే అసత్యాలు, మేం చెప్పే నిజాలు.. రెండూ మీడియాలోకి వెళ్తున్నాయి. ప్రజలు గందరగోళ పడే ప్రమాదం ఉంది. అందుకే మీడియాను, జర్నలిస్టు నాయకులను కోరుతున్నాం. దయచేసి వాస్తవాలేంటో, ఎన్నికల ఫలితాల నిజాలేంటో మీరే విచారించి చెప్పండి. ఇది మీడియా బాధ్యత కూడా.
ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా జరిగాయా?
► పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల కమిషనరే చెప్పారు. అయినా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చంద్రబాబు అనడం విడ్డూరం. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ దుకాణం బంద్ అయింది.
► అయినా చంద్రబాబు ఇంకా భ్రమలు కల్పిస్తున్నారు. కేడర్‌ను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే పంచాయతీల్లో 38శాతం గెలుపు మాదే అని చెప్పుకుంటున్నాడు. తలకిందులైనా అది ఆసనమేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
బాబూ ఇక పప్పులుడకవ్
► గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్ జగన్ ప్రజా రంజక పాలన అందిస్తున్నాడని టీడీపీ క్యాడరే చెబుతోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేయలేమని చెబుతున్నారు. అందుకే ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి.
► రెండు చానల్స్, పత్రికలు టీడీపీని జాకీలు పెట్టి పైకి లేపాలని శ్రమిస్తున్నాయి. మంత్రి కొడాలి నాని ఊర్లోనే పార్టీ అభిమాని ఓడిపోయినట్టు వార్తలు సృష్టించారు. అసలా గ్రామమే తనది కానప్పటికీ అలా చేశారు.
► జరగబోయే పంచాయతీల ఫలితాలు ఇంతకన్నా ఎక్కువగా వైఎస్సార్‌సీపీ అభిమానుల వైపే ఉంటాయి. పార్టీ గుర్తుతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అసలు రంగేంటో బయట పడుతుంది.
► విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర నిర్ణయాన్ని ఆపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఈ విషయంలో లోకేశ్ అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాడు.
రాధాకృష్ణది డైవర్షన్ రాజకీయం
పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడిన టీడీపీ.. ప్రజల్లో మరింత చులకన అవకుండా దృష్టి మళ్లించడానికే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్క రోజు అయినా గడవకముందే అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు అంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలపై చర్చను పక్కదారి పట్టించడమే వారి లక్ష్యమని, ఈ కుటిల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలపై, కథనాలపై లీగల్‌గా ముందుకు వెళ్తామని చెప్పారు.
సీఎం జగన్, షర్మిల.. ఒకరిపై ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉందని తెలిపారు. మహానేత వైఎస్సార్ కుటుంబం చాలా పెద్దదని, ఆ కుటుంబంలో అందరూ విశాలమైన భావాలు కలవారని వివరించారు. ఇప్పటికైనా రాధాకృష్ణ చౌకబారు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి రాతలు, కథనాల ద్వారా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మేలు చేద్దామని, సీఎం జగన్ ఇమేజ్‌ను తగ్గిద్దామని రాధాకృష్ణ భావిస్తే, అది అవివేకమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ రాతల ద్వారా రాధాకృష్ణ నీచమైన, కుచ్చితమైన బుద్ధి బయట పడుతోందన్నారు. ‘అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలు మాత్రమే. విభేదాలు ఎంత మాత్రం కావు’ అని గతంలో కూడా చెప్పామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్.. తెలంగాణలో పార్టీ విస్తరణ కోరుకోవడం లేదని ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment