సాక్షి, అమరావతి: పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ వాదనకు చంద్రబాబు వంత పాడటం అన్యాయమన్నారు. దీనివల్ల తెలంగాణలోని అధికార పార్టీ, అక్కడి టీడీపీతో వీళ్లకు లోపాయికారీ ఒప్పందం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ మరో ఒకట్రెండు రోజుల్లో జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకే పెద్దపీట వేస్తామని వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..
పంచాయతీల ఊపిరి తీసింది ఆయనే..
గ్రామ సచివాలయం పెట్టి సర్పంచ్‌ల అధికారాలు తీశారని, ఇదే తరహాలోనే కేంద్రం కూడా రాష్ట్రంలో పెడితే ఒప్పుకుంటారా అని చంద్రబాబు వితండవాదం చేయడం దారుణం. తన హయాంలో చట్టవిరుద్ధమైన జన్మభూమి కమిటీల పేరుతో నిలువునా దోచుకున్నారు. సర్పంచ్‌లకు అధికారాలు లేకుండా.. పంచాయతీల ఊపిరి తీసింది ఆయనే. గ్రామ స్వరాజ్యం గురించి ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. గ్రామ పరిధిలోనే పౌర సేవలు అందించాలనే వైఎస్ జగన్ గ్రామ సచివాలయం తీసుకొచ్చారు. సంగం డెయిరీ కేసులో ఆధారాలు ఉండబట్టే కేసు పెట్టారని చంద్రబాబు తెలుసుకోవాలి. ఇందులో చంద్రబాబుకు కూడా వాటాలు అందాయనేందుకు ఆధారాలున్నాయి. సంగం డైరీ పాలను హెరిటేజ్‌కు పంపారు. నిజానిజాలు విచారణలో తేలుతాయి.
తెలంగాణతో టీడీపీ లాలూచీ
విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ అడ్డగోలుగా కృష్ణా జలాలను వాడుతుంటే ఏపీకి అన్యాయం జరుగుతోంది. దీనిపై చంద్రబాబు ఒక్కమాట మాట్లాడకపోవడం అన్యాయం. ప్రభుత్వంతో కలిసి నిరసన తెలపాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఇది చెయ్యకుండా జిల్లాల మధ్య తగువు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆఖరుకు.. రాజకీయ భిక్షపెట్టిన చిత్తూరు జిల్లాలో తాగునీటి అవసరాలకు ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటుంటే.. టీడీపీ నేతలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డుకోవడం దిగజారుడు రాజకీయం కాదా? ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో నిరసన చెప్పించడం తెలంగాణ వాణిని సమర్థించడం కాదా? ఏ ప్రాంత ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా, వృ«థా జలాలను ఒడిసి పట్టుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు విస్మరించిన ప్రాజెక్టులనూ పూర్తిచేస్తున్నారు. కానీ, రాష్ట్రాన్ని కుంగదీయడమే చంద్రబాబు అజెండా. అసత్యాలతో ప్రజలను ఎల్లో మీడియా తప్పుదారి పట్టిస్తోంది. జల వివాదంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధమే. కానీ, వాళ్లు ముందుకు రావాలి కదా.
చంద్రబాబువల్లే ఈడబ్ల్యూఎస్‌కు చిక్కులు
ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ ఇవ్వడంపై ఈనాడు కథనం పక్కదారి పట్టించేలా ఉంది. అధికారం కోల్పోయే ముందు చంద్రబాబు కాపుల ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కులవల్ల సమస్య ఏర్పడింది. ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను ప్రకటించి తీరుతుంది. రాష్ట్రంలో ఒకట్రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది. 50 శాతం పోస్టులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు, 50 శాతం మహిళలకు ఉండేలా కసరత్తు జరుగుతోంది. అందుకే కాస్త ఆలస్యమైంది.
మైనింగ్ బాగోతాలు బయటకొస్తాయనే యాగీ
లేటరైట్ లీజులిచ్చింది టీడీపీ హయాంలోనే. దీన్ని ఎల్లోమీడియా తప్పుదారి పట్టిస్తోంది. చంద్రబాబు హయాంలో మైనింగ్ కుంభకోణాలు ఎక్కడ బయటకొస్తాయోనని ముందుగానే యాగీ చేసున్నారు. కోవిడ్ మరణాలపైనా ఎల్లో మీడియా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. రాష్ట్రానికి నష్టం కలిగించే వ్యాఖ్యలను చంద్రబాబు మానుకోవాలి. ప్రజలకు ఏమాత్రం మేలు చేయకుండానే ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. వైఎస్ జగన్ కోవిడ్ కష్టకాలంలోనూ నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నారు. రివర్స్ టెండరింగ్‌తో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. కానీ, బాబు హయాంలో విచ్చలవిడిగా చేసిన అప్పుల భారం ఈ ప్రభుత్వంపై పడింది. కేంద్రం నిధులకు కత్తెరేసిందని టీడీపీ ఆనంద పడటమేంటి?
Comments
Please login to add a commentAdd a comment