
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి విధ్వంసాలకు పాల్పడుతున్నారు.. సున్నితమైన అంశాలపై మేం ఎప్పుడూ ఆందోళన చేయలేదు.రామతీర్థం ఘటన పథకం ప్రకారమే చేయించారు. ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో ఆలయాలను కూల్చేశారు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌తో 29 మంది చనిపోయారు. సదావర్తి భూముల సంఘటన మర్చిపోయారా?. దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. (చదవండి: ‘లోకేష్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు’)
మతపరమైన అజెండా ఉన్న బీజేపీ కూడా చంద్రబాబులా స్పందించడం లేదు. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్ సహించరని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా పనిచేస్తున్నామని, సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. (చదవండి: లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్‌కి సంబంధముందా..?)