ధరలు పెంచి.. ధర్నాలు చేస్తారా? | Sajjala Ramakrishna Reddy Press Meet Over Petrol Prices | Sakshi
Sakshi News home page

ధరలు పెంచి.. ధర్నాలు చేస్తారా?

Published Mon, Nov 8 2021 6:34 PM | Last Updated on Tue, Nov 9 2021 1:28 PM

Sajjala Ramakrishna Reddy Press Meet Over Petrol Prices - Sakshi

సాక్షి, అమరావతి: ‘పెట్రోల్, డీజిల్‌ ధరలు మీరే పెంచేసి.. వాటిని తగ్గించాలని ధర్నాలు చేస్తారా?’ అంటూ బీజేపీ, టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎక్సైజ్‌ సుంకం పిసరంత ఉంటే కొండంత సెస్సులు వేసి పెట్రోల్, డీజిల్‌ ధర లీటర్‌ను రూ.వంద దాటించి, రూ.ఐదో, పదో తగ్గించి.. రాష్ట్రాలను ధర తగ్గించాలని ధర్నాలు చేయడంకంటే దిగజారుడుతనం మరొకటి ఉంటుందా?’ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. 2015 ఫిబ్రవరి 5 నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ లీటర్‌పై రూ.4 చొప్పున వ్యాట్‌ విధించింది టీడీపీ సర్కారు కాదా అని చంద్రబాబును నిలదీశారు. పెట్రోల్, డీజిల్‌ ధరలను సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు పెంచలేదని స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంవల్ల అవి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి మరమ్మతులు చేయడం కోసమే పెట్రోల్, డీజిల్‌పై కేవలం లీటరుకు రూ.1 చొప్పున సెస్‌ విధించామని తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు వారు చేసిన తప్పులు, పాపాలను వైఎస్సార్‌సీపీ సర్కారుపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  

సెస్సుల రూపంలో కేంద్రం రూ. లక్షల కోట్లు వసూలు 
‘2017లో కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గితే.. దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయని.. ముడి చమురు ధరలు పెరిగితే వీటి ధరలు పెరుగుతాయని చెప్పింది. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్రం తగ్గించలేదు. సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం, సెస్సుల రూపంలో కేంద్రానికి 2016–17లో రూ.3,35,175 కోట్లు, 2017–18లో రూ.3,36,163 కోట్లు, 2018–19లో రూ.3,48,041 కోట్లు, 2019–20లో రూ.3,34,315 కోట్ల ఆదాయం వస్తే.. 2020–21లో ఇప్పటికే రూ.4,53,812 కోట్ల ఆదాయం రావడమే అందుకు నిదర్శనం.

2019–20లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎక్సైజ్‌ సుంకం కింద రూ.47,500 కోట్లు వస్తే.. సెస్సుల రూపంలో రూ.3,15,700 కోట్లు వచ్చింది. ఎక్సైజ్‌ సుంకంలోనే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తుంది. సెస్సుల ఆదాయం ఒక్క పైసా కూడా ఇవ్వదు. అంటే రూ.19,475 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. సెస్సుల రూపంలో ప్రజల నుంచి దోచిన రూ.లక్షలాది కోట్లను కేంద్రం ఏం చేస్తోందో చెప్పాలి. సెస్సులు తగ్గిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ని రూ. 60–70 కి ఇవ్వొచ్చు. సామాన్యలపై భారం తగ్గించవచ్చు’ అని వివరించారు. మరో వైపు కేంద్రం 2013–14 నాటికి రూ.53,11,081 కోట్ల అప్పులు చేస్తే.. ఆ రుణం ప్రస్తుతం రూ.1,16,21,780 కోట్లకు చేరుకుందని.. అంటే ఏడేళ్లలో కేంద్రం రూ.63,10,699 కోట్ల అప్పు చేసిందని, అప్పుగా తెచ్చిన నిధులను కేంద్రం ఏం చేసిందో వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలను నిలదీశారు. 
చదవండి: శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్‌ 
ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 25 ఏళ్లపాటు యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తున్నామని సజ్జల స్పష్టంచేశారు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నుంచి పీపీఏలు చేసుకుని చంద్రబాబు వేలాది కోట్ల రూపాయలు కమీషన్లుగా వసూలు చేసుకున్నారని ఆరోపించారు. ‘బాబు చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుదుత్పత్తి చేసినా, చేయకున్నా వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌ పద్ధతిలో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.7, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.5 చొప్పున కొనేలా పీపీఏలు కుదుర్చుకుని.. కమీషన్లు వసూలు చేసుకున్నారు.

చంద్రబాబు కమీషన్ల వల్లే డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటివల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది’ అని చెప్పారు. ‘చంద్రబాబు పాలనలో చీకటిమయంగా మారిన రాష్ట్రాన్ని వెలుతురులోకి తేవడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే సెకీ నుంచి యూనిట్‌ను రూ.2.49కే కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. సరఫరా నష్టాలు, ఇతర పన్నులతో కలిపి ఈ రేటుకు ఇవ్వడానికి సెకీ ముందుకొచ్చింది. అదే సంస్థ నుంచి తమిళనాడు సర్కారు యూనిట్‌ను రూ.2.61కు కొంటోంది. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదు. ఏవైనా తప్పులు జరిగితే.. ఆధారాలతో సహా చూపడం ద్వారా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు. అవాస్తవాలతో సర్కారుపై బురద జల్లడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఛీకొడతారు’ అని సజ్జల చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement