సాక్షి, హైదరాబాద్: పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీడియాకు ఎవరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పీఏసీ మీటింగ్‌లో ఏం జరిగిందో నేను చెప్పను. నా ఆవేదనను ఇంఛార్జ్ ఠాగూర్‌కు తెలియజేశా. నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను. సోనియా, రాహుల్ గాంధీలను కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతా. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో జీవితాంతం పనిచేస్తా. నా వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఇండిపెండెంట్‌గా ఉంటా తప్పితే.. మరో పార్టీలోకి వెళ్ళను.
పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని నాకు లేదు. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను, ఖండించను. నాతో వీహెచ్, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కానీ ఆ విషయాలు బయటకు చెప్పను. కాంగ్రెస్‌నా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి జాగిరి కాదు. సోనియా జాగిరి. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ ఉంటుంది.
గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్లాట్‌లను, పర్మిషన్‌లేని ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని గతంలో సీఎంకు లేఖ రాశా. పాత లే అవుట్‌లను రెగ్యులరైజ్ చేయండి.. కొత్త లేఅవుట్ లు చేయకుండా చర్యలు తీసుకోండి అని కోరా. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈ నెల 8న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్కులో దీక్ష చేస్తా. కోవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తా. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా దీక్ష చేస్తాను' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment