సాక్షి, ముంబై: ప్రతీకార రాజకీయాలతో శివ సేనను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించారని శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
‘మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తుడిచిపెట్టేస్తాం’ అనే ధోరణితో దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. సంజయ్ రౌత్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అయినా ఏ దశలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పుష్ప అనే సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఝుకేగా నహీ(తగ్గేదే లే) అని. అది రౌత్‌కు అన్నివిధాల సరిపోతుంది. నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారు. కొందరిలా ఆయన ఈడీ బూచికి భయపడలేదు. పిరికిపందలా వెన్నుచూపలేదు. ఎక్కడా తగ్గలేదు. బాలా సాహెబ్ చూపిన మార్గం ఇదే. రౌత్ నిజమైన శివ సైనికుడు అంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు గుప్పించారు.
సోమవారం మధ్యాహ్నాం రౌత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం.. ఉద్దవ్ థాక్రే పైవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రౌత్‌కుటుంబ సభ్యులు సైతం బీజేపీపై మండిపడ్డారు. బీజేపీపై సంజయ్ రౌత్ సహేతుక విమర్శలతో విరుచుకుపడుతున్నారని, అందుకే భయపడే ఈడీని ఆయనపై ప్రయోగించిందని బీజేపీపై సంజయ్ రౌత్ కుటుంబం ధ్వజమెత్తింది.
ఇదిలా ఉంటే.. పత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆరేడు గంటలపాటు ఆయన్ని పశ్నించి.. చివరికి అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేసింది. సోమవారం మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సంజయ్ రౌత్‌ను.. నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది ముంబై కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment