పవన్ తిక్కపై కార్యకర్తల ఆవేదన
సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
పవన్ ఎంపీ సీట్ల లెక్కపై విస్తుపోతున్న జనం
పెందుర్తి/ఏలూరు (టూటౌన్): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిక్కతో విసిగిపోయి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. టీడీపీ ముష్టి విసిరినట్టు కేవలం 24 సీట్లు విదిల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తలెక్కడ పెట్టుకోవాలంటూ అవమానభారంతో కుమిలిపోతున్నారు. టీడీపీకి ఊడిగం చేయాలా అంటూ మండిపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా పవన్ తీరు ప్యాకేజ్ మహిమే అని నిర్ధారణకు వచ్చేసినట్టు వారి పోస్టులు ఉన్నాయి.
జనసేన క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యానికి అవి అద్దం పడుతున్నాయి. టికెట్ల ప్రకటన సందర్భంగా ఎంపీ సీట్లలోని అసెంబ్లీ స్థానాలనూ కలిపి పవన్ చెప్పిన వింత లెక్కపైనా విస్మయం వ్యక్తమవుతోంది. పెందుర్తి సీటు టీడీపీకి కేటాయిస్తారని జరుగుతున్న ప్రచారంపైనా జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి సహకరించబోమని స్పష్టం చేస్తోంది.
ఏలూరులో నిరసన
ఏలూరు అసెంబ్లీ సీటును జనసేన పార్టీకి కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఏలూరు కార్యాలయంలో బుధవారం కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్టీ నగర అధ్యక్షుడు కె.నరేష్ మాట్లాడుతూ జనసేన తరఫున రెడ్డి అప్పలనాయుడికి టికెట్ ఇవ్వాలని, ఏలూరు సీటుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభను తాము బహిష్కరించినట్టు వివరించారు.
జనసైనికులు పెట్టిన కొన్ని పోస్టులివీ..
లాగిపెట్టి కొట్టినట్టయింది
‘మాకు 24 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే బాబు ఇచ్చాడు. అయితే మా అధినేత పవన్ అన్నట్లు మూడు ఎంపీ స్థానాల్లో ఉన్న 21 (ఎంపీ స్థానానికి ఏడు చొప్పున) అసెంబ్లీ స్థానాలను కలుపుకుంటే 45 సీట్లలో మా పార్టీ పోటీ చేస్తుందని ఓ టీడీపీ మిత్రుడి దగ్గర అన్నాను.
వెంటనే ఆ టీడీపీ కార్యకర్త ‘మా పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ చెప్పినట్లు మిగిలిన 22 ఎంపీ స్థానాలతో కలిపితే అవి మరో 154 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అంటే మేం 305 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు’ కదా అన్నాడు. దెబ్బకు లాగిపెట్టి కొట్టినట్లయింది.’ – ఫేస్‌బుక్‌లో పెందుర్తికి చెందిన ఓ జనసైనికుడి ఆక్రోశం
ముద్ద దిగట్లేదన్నా
‘జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం అన్నారు. టీడీపీ సీట్లు ఇవ్వడం కాదు. మేమే తీసుకుంటాం అన్నారు. తీరా 24 సీట్లు ఇస్తే సూపర్ డూపర్ అంటున్నారు. మనం చెప్పే డైలాగులకు.. మనకు పడేసిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా పవనన్నా’. ‘అంతన్నవ్ ఇంతన్నవ్.. చివరకు 24తో సరిపెట్టావ్. ‘పవనన్నా నువ్వు చేసిన పనికి ముద్ద దిగడం లేదన్నా’ – మరికొందరు కార్యకర్తల ఆక్రందన
Comments
Please login to add a commentAdd a comment