‘పార్టీయేతర ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి కనుక ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతుగా రాజకీయ పార్టీలు కటౌట్లు, హోర్డింగ్‌లు, గోడలపై పెయింటింగ్‌లు, బ్యానర్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయకూడదు’
– 2018 అక్టోబర్ 25న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారిపోతే ఎన్నికల నిబంధనలూ మారిపోతాయా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల విషయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక మరోలా నడుచుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయాన్ని నిరోధించిన ఆయన ఇప్పుడు వాటి జోక్యాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలతో వెల్లడవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహించేలా వాటి నుంచి ఫిర్యాదులు స్వీకరించడం.. గ్రామాల్లో శాంతి, ఐక్యతకు దోహదం చేసే ఏకగ్రీవ ఎన్నికలపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందంటూ హెచ్చరికలు జారీ చేయడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మరోవైపు విశేషాధికారాల పేరుతో అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ, ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని విశ్లేషిస్తున్నారు. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం
రాజకీయాల రంగు పులిమేలా..
పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావులేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తప్పుబట్టడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయాల రంగు పులుముకుంటే పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు దారి తీసి ప్రశాంతతకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: సెన్సూర్ అధికారం ఎస్‌ఈసీది కాదు
ఈ నేపథ్యంలో అసలు రాజకీయ పార్టీల ప్రమేయమే ఉండకూడదని తానే ఆదేశాలు జారీ చేసి మళ్లీ ఇప్పుడు ఏకగ్రీవ ప్రకటనలపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాయనడంపై అధికార యంత్రాంగం, నిపుణులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను తప్పుబట్టడమే కాకుండా ప్రకటనలిచ్చిన అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయడాన్ని విపరీత ధోరణిగా అభివర్ణిస్తున్నారు. 2018లో నెంబరు 145–ఎస్‌ఈసీ–బి2– ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలకు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకూడదు. అంటే ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టకూడదని నిపుణులు పేర్కొంటున్నారు.
టీడీపీ మేనిఫెస్టో.. ఉల్లంఘన కాదా?
పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహించేలా ఎస్‌ఈసీ వ్యవహరిస్తుండటాన్ని అలుసుగా తీసుకొని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మునుపెన్నడూ లేని వింత పోకడలకు తెర తీశారు. పార్టీయేతర ప్రాతిపదికన జరిగే పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు కనీసం బ్యానర్లు కూడా కట్టకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తే.. చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటర్లకు హామీలు గుప్పిస్తూ తాజాగా ఏకంగా మేనిఫెస్టోనే విడుదల చేయడం గమనార్హం. మరి ఇది ఎలాంటి ఉల్లంఘన కిందకు వస్తుందో ఉత్తర్వులిచ్చిన నిమ్మగడ్డే తేల్చాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment