ముంబయి: అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చీలిక తేవడం మహారాష్ట్ర రాజకీయంలో పెను సంచలన మార్పు. ఈ కీలక పరిణామంలో రాజకీయ ఉద్దండుడిగా పేరుగాంచిన శరద్ పవార్ ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ తన మేథోసంపత్తితో పార్టీ పునర్నిర్మాణం దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో నాసిక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అజిత్ పవార్‌ను ఉద్దేశించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవ్వరినీ నమ్మకూడదని అన్నారు.
కొందరిని గుడ్డిగా నమ్మి తప్పు చేశానని శరద్ పవార్ అన్నారు. మళ్లీ అలాంటి తప్పులను పునరావృతం చేయబోనని చెప్పారు. 83 ఏళ్లు వచ్చాయని రిటైర్‌మెంట్‌పై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ తిప్పికొట్టారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆయన వయస్సు ఏంటో తెలుసా? అని సభా వేదికగా ప్రశ్నించారు. (నా టైర్డ్ హు.. నా రిటైర్డ్ హు..) అలసిపోను.. రిటైర్‌మెంట్ తీసుకోను అనే వాజ్‌పేయీ వ్యాఖ్యలను గుర్తుచేశారు.
సొంత కొడుకును కానందునే తనను ఎన్సీపీలో పక్కకుపెట్టారని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. కుటుంబ విషయాలు బయట మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ క్రమంలో పార్టీని పునర్నిర్మించడానికి రాష్టవ్యాప్త పర్యటనకు శరద్ పవార్ తెరతీశారు. తిరుగుబావుటా ఎగురవేసిన తన సన్నిహితుడైన ఛగన్ బుజ్‌భల్ నియోజకవర్గమైన నాసిక్ జిల్లా యోలా నుంచి శరద్ పవార్ ర్యాలీ ప్రారంభించడం గమనార్హం.
ఇదీ చదవండి: ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
Comments
Please login to add a commentAdd a comment