![Shiv Sena Workers not Happy With Urmila Matondkar For Council - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/2/urmila_0.jpg.webp?itok=Ac_fFnlW)
సాక్షి, ముంబై : చట్టసభలోకి అడుగుపెట్టాలనుకుంటున్న రంగీలా ఫేమ్ ఊర్మిళా మటోండ్కర్ ఆశలు అడియాశలు అయ్యేలానే కనిపిస్తున్నాయి. అధికార శివసేన నుంచి శాసనమండలికి నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాష్ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మూడు పార్టీల నేతలు ఓ అంచనాకు సైతం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. (చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!)
గవర్నర్ నామినేటెడ్ సభ్యుల కోటాలోంచి బాలీవుడ్ నటి ఉర్మిళా మాతోండ్కర్‌ను విధాన పరిషత్‌కు పంపడం ఖాయమని తేలడంతో శివసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఉర్మిళ కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటపడ్డారు. ఇప్పుడు శివసేన అధిష్టానం ఆమెను ఏకంగా విధాన పరిషత్‌కు పంపించనున్నట్లు తెలియడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
గత అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన బెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నేరుగా మండలికి పంపడంపై సరైంది కాదని చర్చించుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే మేం ఇలాగే పార్టీలో ఉండిపోవాలా..? అని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా,శివసేన ఇచ్చిన ఆఫర్‌ను ఊర్మిళా మాతోండ్కర్ ఆమోదించినట్లు తెలిసింది. అయితే కార్యకర్తల అభిప్రాయాలను శివసేన పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment