![Shock To Former Minister Devineni Uma - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/2/Devineni-Uma.jpg.webp?itok=IXxn69GT)
భవానీపురం(విజయవాడ పశ్చిమ): టీడీపీకి దెబ్బమీద దెబ్బపడుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనూ చతికిలపడింది. వైఎస్సార్ సీపీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్షం పట్టుఉందని చెప్పుకుంటున్న గ్రామాల్లోనూ పునాదులు కదిలిపోయాయి. మైలవరం నియోజకవర్గానికి గుండెకాయగా ఉండే గొల్లపూడిలో అధికార పక్షంలో చేరేందుకు క్యూ కడుతున్నారు. టీడీపీ కేడర్‌లో అయోమయం నెలకొంది.
అత్యంత కీలకమైన గ్రామం
మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి అతి పెద్ద గ్రామం. ఒక్క గ్రామంలోనే 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉండేది ఇక్కడే. టీడీపీ తరఫున ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. గొల్లపూడి 1, 3, 5, 8 సెగ్మెంట్ అభ్యర్థులు చెరుకుమల్లి నరేంద్ర, దాఖర్ల కిషోర్‌బాబు, యడవల్లి శారమ్మ, పిళ్లా శివ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మారిన సమీకరణలు
ఒక్కప్పుడు దేవినేని ఉమాకు అండగా ఉన్న గ్రామం సంక్షేమ ప్రభుత్వం వెంట నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న దేవినేని ఉమాకు తాజా పరిణామాలతో దిమ్మతిరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియా ముందు హడావుడి చేసే ఉమాకు షాక్ తగిలింది. గొల్లపూడిలో ఇటీవలే సీఎం జగన్ ప్రభుత్వం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావుల చేతుల మీదుగా 3,648 ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు.
కాలనీల నిర్మాణంతో..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ముందున్న తలశిల రఘురాం తన సొంత గ్రామంలో పేదలకు 3,648 ఇళ్ల పట్టాలను ఇచ్చి పాదయాత్ర కాలనీలను నిర్మించేలా పేదలకు మేలు చేశారు. దీంతో గొల్లపూడిలో రాజకీయం మొత్తం మారిపోయింది. దేవినేని ఉమా ఇప్పుడు ప్రభుత్వ పథకాల వలన తన పార్టీ అభ్యర్థ్ధులను కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది.
చదవండి:
విజయవాడ టీడీపీలో లుకలుకలు..
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్!
Comments
Please login to add a commentAdd a comment