సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ప్రతి నెలా మొదటి వారంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంబంధిత అంశాలు పీఏసీలో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయాలు అమలు చేయాలని తీర్మానించారు.
శుక్రవారం గాందీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌జావెద్, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పీఏసీ ఉన్నట్టా లేనట్టా?
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్‌రావ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఏసీ సమావేశాలు నిర్వహించకపోవడంపై చర్చ జరిగింది. తొలినాళ్లలో ఒకసారి మాత్రమే నిర్వహించారని, ఆ తర్వాత ఎలాంటి సమావేశం జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ‘వచ్చే నెల రెండో తేదీన జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి న సోనియాగాం«దీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చిత్రపటాలకు పాలాభి షేకం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రోజుకో కార్యక్రమం చొప్పున 20 రోజుల పాటు ‘దశాబ్ది దగా’పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి.
గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాలి..’ అని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నన్ని రోజులు పార్టీ శ్రేణులు తమ ఇళ్లపై కాంగ్రెస్ జెండాలు ఎగురవేయాలని సమావేశం పిలుపు నిచ్చి ంది.
ఇప్పుడు వారికే దోచిపెడుతున్నారు: మధుయాష్కీ
గతంలో ఆంధ్ర వాళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వారికే దోచిపెడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ముఖ్య నేతల భేటీ అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వీహెచ్, సంపత్‌కుమార్, నదీమ్ జావెద్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
త్వరలోనే పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన ఏర్పాటు చేస్తామని, ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను ఆహా్వనిస్తామని చెప్పారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా బహిష్కరించనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హిమాచల్ సీఎం సుఖుపై బీఆర్‌ఎస్ నేతల విమర్శలను వారి విచక్షణకే వదిలివేస్తున్నామని శ్రీధర్‌బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment