
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చంద్రబాబుకు ఆగస్టు నెలలో ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తుంటే రాష్ట్రంలో ఉన్న రామోజీకి, రాధాకృష్ణ, టీవీ–5 నాయుడులకు కనిపించడం లేదా, వినిపించడం లేదా? అని రాష్ట్ర పశుసంవర్ధశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. సుమారు రూ.118 కోట్లు తేడా వచ్చాయని వాటికి సంబంధించి పూర్తి లెక్కలు, వివరాలు ఇవ్వకపోతే చంద్రబాబుపై పూర్తి చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ తెలిపినట్లు మీడియాలో కథనాలు వస్తున్నా ఎల్లోమీడియా మాత్రం నాలుగులైన్ల వార్త కూడా రాయకపోవడం దారుణమని చెప్పారు.
ఎల్లోమీడియా ఉన్నంతకాలం రాష్ట్రానికి మంచి రోజులు రావన్నారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారని గుర్తుచేశారు. మీ కులం వ్యక్తి అయిన చంద్రబాబు తప్పులు ప్రజలకు తెలియజేయకుండా మౌనం వహించడమే మీకు తెలుసన్న విషయం అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో మీ కులానికి చెందిన వ్యక్తి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి తప్పుచేసి ఉంటే రోజుల తరబడి పతాక శీర్షికల్లో వార్తలు చూపించేవారని చెప్పారు. ఇదేనా మీ నైతిక విలువలు, సిద్ధాంతాలు అని మండిపడ్డారు.
చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో వినయ్, విక్కి అనే వ్యక్తుల ద్వారా బోగస్ కంపెనీలు రిజిస్టర్ చేసి వాటికి సబ్ కాంట్రాక్టులు పనులు ఇప్పించుకుని సబ్‌కాంట్రాక్టుల ఖాతాల్లో డబ్బులు వేసి తిరిగి వాటిని బాబుకు చేర్చేవారని, ఇదేనా సంపద సృష్టించడమంటే అని ప్రశ్నించారు.
పోలవరం ఒరిజినల్ బిడ్డర్‌ని పక్కన పెట్టి రామోజీరావు బంధువు నవయుగ వారికి ఇచ్చేసిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. ఇన్నాళ్లు తొడలు గొట్టిన చంద్రబాబు మూడురోజుల నుంచి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు ధరలు పెరిగినప్పుడు సీఎం జగన్ వల్లే పెంచారని ప్రచారం చేసే పచ్చమీడియా, చంద్రబాబు.. ధరలు తగ్గినప్పుడు జగన్ వల్ల తగ్గాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
పవన్ నోరు ఏమైంది?
‘ప్యాకేజీ స్టార్.. ఇప్పుడు ఎందుకు నీ ప్రశ్నించేతత్వం మౌనంగా ఉంది? నీ యజమాని చంద్రబాబు అక్రమాలు బయటపడితే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు. అంటే నువ్వు నిజంగా ప్యాకేజీకి అమ్ముడుపోయావని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే పవన్‌కు ముఖ్యం’ అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment