
న్యూఢిల్లీ: 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాధించిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఆరోపించారు. ఈ కేసులో సిట్ ఎలాంటి విచారణ జరపలేదని, పైగా నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిందని గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సభ్యులకు, పోలీసులకు ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు శిక్ష పడకుండా సిట్ రక్షణ కల్పించిందని పేర్కొన్నారు.
2002 ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుల్బర్గ్ సొసైటీ వద్ద జరిగిన అల్లర్లలో ఎహసాన్ జాఫ్రీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల వ్యవహారంలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీతో సహా 64 మంది నిందితులకు ‘సిట్’ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు లాయర్ సిబల్ వాదించారు. అల్లర్లు జరుగుతున్నా గుజరాత్ సర్కార్ మిన్నకుండిపోయిందన్నారు. కేసులో ‘సిట్’ ఎలాంటి విచారణ జరపకపోగా నిందితులకు కొమ్ముకాసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 16న వాదనలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment