సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం విజయవంతమయ్యేలా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని, అందుకు తమ పార్టీ సభ్యులంతా తీవ్రంగా కృషిచేయాలని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ పిలుపు నిచ్చారు. కోవిడ్ టీకాపై పౌరుల్లో నెలకొన్న భయాలు, సంకోచాలను నివృత్తి చేసేలా పార్టీ కార్యకర్తలంతా తమ వంతు కృషిచేయాలని సోనియా అభిలషించారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంకావాలని, ఈ సంక్షోభం బారిన పడకుండా చిన్నారులను కాపాడుకోవాలని ఆమె సూచించారు. గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, పలు రాష్ట్రాల ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లతో వర్చువల్ విధానంలో సోనియా గాంధీ మాట్లాడారు.
‘రోజువారీగా పౌరులకు ఇస్తున్న కోవిడ్ టీకా డోస్‌ల సంఖ్యను మూడింతలు పెంచేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడితేవాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమైతేనే ఈ ఏడాది చివరినాటికి జనాభాలో 75 శాతం మందికి టీకా ఇవ్వాలనే లక్ష్యాన్ని సాధించగలం. లక్ష్యాన్ని చేరాలంటే ఆ స్థాయిలో టీకా డోస్‌ల సరఫరా ఉండాల్సిందే. మన తీవ్ర ఒత్తిడి కారణంగానే రాష్ట్రాలకు టీకాల సరఫరా పెంచారు. ప్రజల్లో టీకాపై ఇంకా ఉన్న అపోహలను తొలగించేందుకు కార్యకర్తలు వారిలో అవగాహన పెంచాలి. అప్పుడే టీకాల వృథా అనేది చాలా స్వల్పస్థాయికి దిగివస్తుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రో ధరలపై నిరసనగా దేశవ్యాప్తంగా జూలై 7 నుంచి 17 వరకు ఆందోళనలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నిర్ణయించింది.
చదవండి: ట్విట్టర్ ఎండీకి ఊరట
Comments
Please login to add a commentAdd a comment