ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్‌ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?
ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.
ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్ జగన్ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.
నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.
అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.
చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..
ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.
ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్‌లో కళ్లకు కడుతున్నాయి.
పదేపదే అదే మాట అందుకే..
ఓం భూం హాం ఫట్ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.
అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్ జగన్ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా గోబెల్స్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.
–సత్యార్థ్.
Comments
Please login to add a commentAdd a comment