రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా? | Special Story On BJP Leader Etela Rajender | Sakshi
Sakshi News home page

రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా?

Published Sat, Dec 9 2023 6:27 PM | Last Updated on Sat, Dec 9 2023 6:45 PM

Special Story On BJP Leader Etela Rajender - Sakshi

ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఆయనదే గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఢీలా పడతారని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు. తాజా ఎన్నికల్లో మాత్రం అభిమన్యుడిలా ఓడిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో? ఆయన కథేంటో చూద్దాం.

ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా...తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్‌ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది.

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను ఓడగొడుతానని సవాల్ విసిరిన కౌశిక్‌కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది. 

అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్‌ కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్‌లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు. ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో...బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో..  ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి  తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది.

కేసీఆర్ చెంతనే ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్‌లో కొంతమేర ఉన్న అహంకార పోకడలు ఆయనకు మైనస్‌గా మారాయనే వారూ ఉన్నారు. గతంలో హుజూరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ మంత్రిగా కాకుండా..  హుజూరాబాద్ మంత్రిగా పేరు పడ్డ ఈటల.. ఈమధ్య హుజూరాబాద్‌కు దూరమవ్వడం కూడా ఆయనలో వస్తున్న తేడాను ఇక్కడి ఓటర్లు పసిగట్టారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ఈటల చేసేదెంత?.. అధికారపక్షంలో ఉన్నవారైతే అయ్యే అభివృద్ధి ఎంత అనే లెక్కలతో పాటు...ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ కు ఈసారి పెద్దఎత్తున ఓట్లు పోలవ్వడం..కౌశిక్ రెడ్డిపై వెల్లువెత్తిన సానుభూతి కూడా కలిసి.. ఈటల ఓటమికి ఆయన నమ్ముకున్న హుజూరాబాద్‌లోనే బీజం పడింది. 

రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్‌గా ఎదుగుతున్న క్రమంలో.. ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్‌గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement