సాక్షి, అమరావతి: ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు.. సభ్యులు చేతులు ఎత్తే విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నీలం సాహ్ని సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు లేఖ రాశారు. మండల, జిల్లా పరిషత్‌ల వారీగా ఆ రోజు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్లు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధానాన్ని ఎస్‌ఈసీ ఆ లేఖలో వివరించారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆప్టెడెడ్ సభ్యల ఎన్నిక నిర్వహించాలని ఆమె సూచించారు. అదే విధంగా.. జిల్లా పరిధిలో ఎన్నికైన జెడ్పీటీసీలలో సగం మంది హాజరైతే జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఇద్దరు కోఆప్టెడెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలన్నారు.
ఈ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకే ఓటు హక్కు ఉంటుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉండదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. అయితే, ఎన్నిక జరుగుతున్న సమయంలో వారు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఆ సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. ఎన్నిక జరిగే సమయంలో వారికి సమావేశ మందిరంలో ముందు వరుస సీట్లు కేటాయించాలని కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఇక ఎంపీపీ ఎన్నిక పూర్తయితే ఆ మండలంలో ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలని.. జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తయితే ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగించాలని కూడా తెలిపింది.
‘విప్’ అధికారం జనసేనకు లేదు
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసే అధికారం ఎస్‌ఈసీ వద్ద గుర్తింపు కలిగిన 18 రాజకీయ పార్టీలకు మాత్రమే ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంటూ వాటి పేర్లను ప్రకటించింది. ఆ జాబితాలో అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు ఉన్నాయి. అయితే, జనసేన పార్టీకి అందులో చోటు దక్కలేదు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా జనసేనకు ఆ హోదా లేకపోవడంతో విప్ జారీచేసే అధికారం ఆ పార్టీకి దక్కలేదని కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.
24న ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం
ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించాలని నీలం సాహ్ని ఆదేశించారు. అలాగే, 25వ తేదీ మధ్యాహ్నం జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించాలని ఆమె సూచించారు.
చేతులెత్తే విధానంలో.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
Published Tue, Sep 21 2021 2:42 AM | Last Updated on Tue, Sep 21 2021 11:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment