Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు | Story of Disapproval of Kurnool, Nandyal TDP Leaders | Sakshi
Sakshi News home page

Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు

Published Fri, Nov 25 2022 7:22 AM | Last Updated on Fri, Nov 25 2022 9:10 AM

Story of Disapproval of Kurnool, Nandyal TDP Leaders - Sakshi

తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డోన్‌ అభ్యరి్థగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా డోన్‌ నుంచి కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కేఈ వ్యాఖ్యానించడం చూస్తే నేరుగా అధిష్టానంతోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనేది స్పష్టమవుతోంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశమైంది. 

సాక్షిప్రతినిధి కర్నూలు: టీడీపీలోని బలమైన కుటుంబాల్లో కేఈ కుటుంబం ఒకటి. ముఖ్యంగా డోన్‌ నియోజకవర్గాన్ని 40 ఏళ్లుగా తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2014 నుంచి కేఈ ప్రతాప్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగారు. 2014, 2019లో డోన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో ఏడాది కిందట ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆపై డోన్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఏకంగా సుబ్బారెడ్డిని అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనపై కేఈ కుటుంబం తీవ్రంగా రగిలిపోయింది. కేఈ వర్గీయులు బహిరంగంగా సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించారు. బహిరంగ విమర్శలు చేశారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినా చంద్రబాబు తీరు మారలేదు. 

రాజకీయంగా బలపడే ఉద్దేశంతోనే ‘బీసీ’ పావులు  
కర్నూలు, నంద్యాల జిల్లా టీడీపీలో కేఈ, భూమా కుటుంబాల పెత్తనం సాగుతోంది. 2019 ఎన్నికల్లో కోట్ల కుటుంబం కూడా సైకిలెక్కింది. ఈ మూడు కుటుంబాల పెత్తనమే సాగుతుందని, వీరికి చెక్‌ పెట్టి రెండు జిల్లాల రాజకీయాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేది టీడీపీ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో చంద్రబాబుకు కూడా బీసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్‌గా కూడా నియమించారు.

అధిష్టానం వద్ద ఉన్న చొరవతో జిల్లాలో బలమైన కుటుంబాలను బలహీన పరిచేలా పావులు కదుపుతున్నారు. తొలుత కేఈ కుటుంబం బలం తగ్గించేందుకు పత్తికొండకే పరిమితం చేసి డోన్‌ టిక్కెట్‌ దక్కకుండా ధర్మవరం సుబ్బారెడ్డి వెనుక తానే ఉండి వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో డోన్‌ నియోజకవర్గ ఖర్చు కూడా తానే భరిస్తానని బీసీ ఇచ్చిన హామీతోనే సుబ్బారెడ్డిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భూమా, కేఈ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. వీరిని దెబ్బతీసేందుకు కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ప్రతిపాదన బీసీనే చంద్రబాబు వద్ద పదే పదే ప్రతిపాదించారని తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఒకే టిక్కెట్‌ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.

ఆళ్లగడ్డలో అఖిలకు టిక్కెట్‌ ఇస్తే, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి కాకుండా మైనార్టీ కోటాలో ఫరూక్‌ కుమారుడు ఫిరోజ్‌కు టిక్కెట్‌ ఇస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. అలాగే కోట్ల సుజాతమ్మకు టిక్కెట్‌ దక్కకుండా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి బోయ, కురబలను బరిలోకి దింపితే బాగుంటుందని బీసీనే ప్రతిపాదించారని సమాచారం. ఈ దెబ్బతో కోట్ల కుటుంబం నుంచి కూడా సుజాతమ్మకు టిక్కెట్‌ దక్కే అవకాశాలు ఉండవు. దీంతో కేఈ, భూమా, కోట్ల కుటుంబాల బలం తగ్గించడంతో పాటు తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తే ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ తనకంటూ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉండి, ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఎదగాలని పథకం రచించారు. దీన్ని అమలు చేయడంలో భాగంగానే ఒక్కొక్క పావు కదుపుతున్నారని టీడీపీలోని కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. 

ఏదిఏమైనా డోన్‌ నుంచే పోటీ  
కేఈ ప్రభాకర్‌ జన్మదినాన్ని బుధవారం డోన్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో ఘనంగా నిర్వహించారు. ఓరకంగా కేఈ బలపరీక్ష నిర్వహించారు. ఈ వేదికపై నుంచి కేఈ ప్రభాకర్‌ ఏకంగా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు. ‘జనబలం లేనివారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. వీరితో పారీ్టకి ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీలో ఉంటుంది’ అని తేలి్చచెప్పారు. అంతటితో ఆగకుండా తనకు జనబలంతో పాటు ధనబలం కూడా ఉందనే సంగతి మరవొద్దన్నారు. టిక్కెట్‌ ఇవ్వకపోతే జన, ధన బలంతో ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని కేఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆపార్టీ తో పాటు అన్ని పారీ్టల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. అసలు ఈ వివాదానికి ఆద్యుడు బీసీ జనార్దన్‌రెడ్డి అని కేఈ కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

దిగజారుతున్న ప్రతిష్ట
కర్నూలుకు వచ్చిన ‘న్యాయరాజధాని’కి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుకు జిల్లా వాసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. ప్రజలంతా ‘న్యాయరాజధాని’ కావాలనే భావనలో ఉండటం, చంద్రబాబు దానికి భిన్నంగా వ్యవహరించడం టీడీపీకి పెద్ద అడ్డంకి. దీన్ని దాటుకుని ముందుకు వెళ్లడమే కష్టమనే భావనలో ఉన్న టీడీపీని అంతర్గత రాజకీయాలు, నేతల ధిక్కారస్వరాలు మరింత దిగజారుస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement