సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో ఆశావహుల సర్వేలు జోరందుకున్నాయి. బరిలో నిలవాలనుకునే వారు ఎవరికివారే సర్వేలు చేయించుకుంటుండగా.. రాజకీయ పార్టీలు కూడా ప్రజల నాడి తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాలతోపాటు ఎవరి టికెట్ ఇవ్వొచ్చు.. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలను ఆయా రాజకీయ పార్టీలు రాబడుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వేల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంపైనా ప్రత్యేక సర్వే చేయించగా, ప్రశాంత్ కిషోర్(పీకే) బృందం ఇప్పటికే నియోజవకర్గంలో మూడుసార్లు సర్వే చేసింది.
దీనికితోడు మరో ఆరేడు సంస్థలు కూడా తమ సర్వేలను కొనసాగిస్తున్నాయి. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను ఆధారంగా సర్వే చేస్తున్నారు. ఒక్కో మండలంలో ఐదు వేల నుంచి 15 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో సామాజిక వర్గం ప్రధానం కాబోతుందా? పార్టీల వారీగా సంప్రదాయ ఓటింగ్‌కే మొగ్గు చూపుతారా? అన్న వివరాలను తెలుసుకుంటున్నారు.
వారికి ఫాలోయింగ్ ఉందా?
చండూరులోనూ పీకే టీంతోపాటు, పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల నుంచి ఫలానా వారు అభ్యర్థులు అనుకుంటే అందులో ఒక్కొక్కరి పరిస్థితిపైనా ఆరా తీస్తున్నాయి. వారికి ఫాలోయింగ్ ఉందా? టికెట్ ఇస్తే గెలుస్తారా? అసలు అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదికన గెలుస్తారని భావిస్తున్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలి.. పాల్వాయి స్రవంతికి ఇవ్వాలా? టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేతకు ఇవ్వాలా? లేదంటే కొత్తగా తెరపైకి వస్తున్న వారికి ఇవ్వాలా? అందులో ఎవరికి టికెట్ ఇస్తే గెలిపిస్తారు? లేదంటే అధికార పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారా? అన్న వివరాలను అడుగుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేస్తారా? ఆయన్ని మళ్లీ గెలిపిస్తారా? కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరు బెటర్ అనే వివరాలను సేకరిస్తున్నారు.
చదవండి: మునుగోడు తీర్పు దేశమంతా వినిపించాలి
పార్టీల పనితీరేంటి.. జరిగిన అభివృద్ధి ఎంత?
ఈ సర్వేల్లో పార్టీల పనితీరును కూడా అడిగి తెలుసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ బెస్టా.. బీజేపీని గెలిపిస్తారా? కాంగ్రెస్‌కు పట్టం కడతారా? అన్న వివరాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. ఎన్నికలు జరిగితే పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరైతే మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నారు.. గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఎంత.. ఆగిపోయిన పనులు ఏంటి? అందుకు ఎవరు కారణం.. అభివృద్ధి జరగకపోతే ఎందుకు జరగలేదనుకుంటున్నారు.. ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి పనులు కొనసాగుతాయని అనుకుంటున్నారా? అన్న సమగ్ర వివరాలను తీసుకొని క్రోడీకరిస్తున్నారు.
కేంద్రం నిధులతో అభివృద్ధి జరుగుతుందనుకుంటున్నారా?. రాష్ట్రమే అభివృద్ధి చేస్తుందనకుంటున్నారా?. ఎన్నికల్లో ఏయే పార్టీల నడుమ పోటీ ఉంటుంది.. ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఓటు వేసేందుకు రాజకీయ పార్టీలను చూస్తారా, వ్యక్తులను చూస్తారా, సాంప్రదాయ బద్ధంగా ఓటు వేస్తారా, సరి కొత్తగా మార్పు కోరుకుంటున్నారా అన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఆశావహుల సొంత సర్వేలు..
టికెట్‌కు ప్రయత్నిస్తున్న ఆశావహులు కూడా సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా రెండు సర్వేలు సాగుతున్నాయి. బీజేపీ కూడా ఒక సర్వే చేయిస్తోంది. చౌటుప్పల్ మండలంలో సర్వేలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులతోపాటు మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి తరఫున కూడా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment