సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మిగిలి ఉన్న ఎనిమది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొననున్నారు.
ఇక, ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు దఫాల్లో ఏఐసీసీ తొమ్మిది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఈ ఎనిమిదింటిలో మూడు పార్లమెంట్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నుండి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, యుగెంధర్, రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక, భువనగిరి నుండి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. లేనిపక్షంలో బీసీ అభ్యర్థికి ఈ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి లోక్‌సభ స్థానానికి ఓయూ విద్యార్థి నేత కైలాష్ అప్లికేషన్ పెట్టుకున్నారు.
కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న
ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం.
ముగ్గురిలో ఎవరు?
నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మస్కత్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానంపై దమ్మాటి సాంబయ్య ఆశలు పెట్టుకున్నారు. మెదక్ రేసులో నీలం మధు ఉన్నారు. ఆదిలాబాద్ సీటు కోసం ఆదివాసీ, లంబాడ నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment