సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రాజకీయ కక్షతో పలు చోట్ల పెన్షన్ నిలిపివేయించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో 19 మందికి పెన్షన్ ఆపేశారు. టీడీపీ నేతల ఆదేశాలతోనే తమకు పెన్షన్ నిలిపివేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్నటి నుంచి పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో పెన్షన్ కోసం లబ్ధిదారులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
కాగా, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.
ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది.
మరోవైపు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment