సాక్షి, హైదరాబాద్ : గతకొన్ని రోజులుగా మున్సిపల్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించనున్నారని రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌కు రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ఆ డిమాండ్‌ను లేవనెత్తే గళానికి బలం కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని బహిరంగ సభల్లోనే వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తన చర్చకు దారితీసుకున్నాయి. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. కేటీఆర్‌ను సీఎం చేస్తే తప్పేంటని వ్యాఖ్యానించారు. దీంతో త్వరలోనే కేటీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టిస్తారనే వార్తలకు మరింత బలం చేకూరింది. చదవండి: ఫుల్ ఖుషీలో కేటీఆర్
మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేముందని అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ అన్ని పనులు చేయగలడని, సరైన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా కాళేశ్వరంపై అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. 70 ఏళ్లుగా తెలంగాణ ఎడారిగా ఉందని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని బీజేపీ నేతలకు సవాలు విసిరారు.
చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇదివరకే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటిఆర్ అధ్యక్షతన జరగాలని ఆకాంక్షించారు. యువ నేత కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్‌కు సీఎం అయ్యేలా ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ఇది కేవలం తన ఒక్క అభిప్రాయమే కాదని, చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజి రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు. ఈ విషయమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment