సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఈ వారం రోజుల్లో ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహాగానాలు తగ్గట్లుగానే సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అభ్యర్థలు ఎంపికలో బీజేపీ ఓ స్ట్రాటజీతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని.. బలమైన అభ్యర్థులను దించాలని బీజేపీ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఓడినా.. తిరిగి ఎంపీలుగా వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో.. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపైన.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దింపే యోచనలో ఉంది.
కేసీఆర్ పాపులారిటీని, గులాబీ దండు హవాను తట్టుకుని మరి.. హుజురాబాద్‌లో లోకల్ సెంటిమెంట్‌తో ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేయబోయే కామారెడ్డిలో.. అర్వింద్‌ను పోటీ చేయించాలని భావిస్తోంది. అలాగే.. సిరిసిల్లలో కేటీఆర్‌పై బండి సంజయ్‌ను, సిద్దిపేటలో హరీష్ రావు పై బూర నర్సయ్య గౌడ్‌ను బరిలో దింపాలనుకుంటోంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై గుజ్జుల రామకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి పై మహేశ్వర్ రెడ్డి ఇలా.. కీలక నేతలనే బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ వారంలోనే మంత్రులపై పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: సంగారెడ్డిలో వైఎస్సార్ ఫార్ములా
Comments
Please login to add a commentAdd a comment