సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన మొదటి విడత పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు అడ్డదారులు తొక్కారు. ఎక్కడికక్కడ స్థానికులు అడ్డుకోవడంతో ఎక్కడా వారి ఆటలు సాగలేదు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాలతోపాటు రామచంద్రాపురం, నారాయణవనం మండలాల్లోని 342 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మోహరించినా టీడీపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు తెగబడ్డారు. పక్క గ్రామాల నుంచి మనుషులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులు, స్థానికులపై దౌర్జన్యాలకు దిగారు.
► శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లెమిట్టలో టీడీపీ మద్దతు అభ్యర్థి రమేష్ బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోసేందుకు యత్నించాడు.
► పూతలపట్టు మండలం ఒడ్డేపల్లె పోలింగ్ కేంద్రంలో టీడీపీ మద్దతు అభ్యర్థి దొరస్వామినాయుడు అనుచరులు దొంగ ఓట్లు వేసేందుకు రావడంతో ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగి పోలింగ్‌కు అంతరాయం కలిగించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో జారుకున్నారు.
► ఇక పూతలపట్టు పోలింగ్ కేంద్రంలో టీడీపీ మద్దతుదారులు పచ్చచొక్కాలు ధరించి హల్‌చల్ చేశారు.
► తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె పంచాయతీలో మరణించిన వారి ఓట్లను వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. సకాలంలో గ్రామస్తులు పసిగట్టి వారిని తరిమికొట్టారు. ఇదేవిధంగా ఎస్‌ఆర్‌పురం, చిత్తూరు రూరల్, వెదురుకుప్పం మండలాల్లోని పలు పంచాయతీల్లో కూడా టీడీపీ శ్రేణులు మరణించిన వారి పేర్లతో ఓటేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు.
సెల్‌ఫోన్లో వీడియోల చిత్రీకరణ
ఇదిలా ఉంటే.. టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా పోలింగ్ బూత్‌ల వద్ద వీడియోలు చిత్రీకరించారు. వెదురుకుప్పం మండలం ఆర్‌కేఎంపురం పోలింగ్ కేంద్రం వద్ద సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా స్థానికులు ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి పారిపోయాడు. ఇదే తరహాలో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. నారాయణవనం మండలం నార్త్ పాలమంగళం, అరణ్యం కండ్రిగ పంచాయతీల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ టీడీపీ శ్రేణులు వివాదం రేపేందుకు కంట్రోల్ రూంకి ఫోన్‌చేశారు. ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకుని విచారించి దొంగ కాల్‌గా నిర్ధారించారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ అడ్డదారులు
Published Wed, Feb 10 2021 4:12 AM | Last Updated on Wed, Feb 10 2021 4:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment