
ప్రేమ జంట చంద్రశేఖర్, చంద్రిత
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారలేమి.. ప్రజల మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎలాగైనా అధికారపార్టీ వైఎస్సార్‌సీపీపై నిందలుమోపి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని నానాయాగీ చేస్తున్నారు. ఇలాంటిదే శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ఆరు రోజుల క్రితం కేవీబీపురం మండలంలో దొరికిన ఓ మహిళ మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని శవరాజకీయాలకు తెరలేపారు.
చదవండి: వామ్మో చినబాబు.. ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది..!
ఎప్పుడో జనవరిలో ఊరు విడిచివెళ్లిన ఓ ప్రేమికురాలిదే ఆ శవమంటూ రాద్ధాంతం సృష్టించారు. ఐదు రోజులుగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తిట్ల దండకం అందుకున్నారు. వరుసగా ఆందోళనలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో ఆదివారం తాము బతికే ఉన్నామంటూ సదరు ప్రేమజంట వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టీడీపీ అసలు రంగు బయటపడింది. కావాలనే పనిగట్టుకుని రాద్ధాంతం చేసినట్టు తేటతెల్లమైంది. టీడీపీ మరింత అభాసుపాలైంది.
బతికి ఉన్న వాళ్లను కూడా చంపేశారంటూ ఒక శవాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి టీడీపీ, జనసేన నాయకులు ఆందోళనకు దిగి, ఘోరమైన రీతిలో అభాసుపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాళహస్తిలో కలకలంరేపుతోంది. అసలేం జరిగిందంటే స్థానికుల కథనం మేరకు, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలంలోని రామాపురానికి చెందిన బత్తెమ్మ అలియాస్ లలితను తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు గ్రామానికి చెందిన ఠాగూర్‌బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్‌టీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె చంద్రిత అమ్మమ్మ గ్రామమైన రామాపురానికి అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేది. రామాపురం అరుంధతివాడకు చెందిన చంద్రశేఖర్ (గ్రామ వలంటీర్)తో పరిచయమేర్పడింది. ఇతనికి ఇదివరకే పెళ్లై ఒక బిడ్డకూడా ఉన్నాడు.
2021లో చంద్రశేఖర్, చంద్రిత గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు రోజుల్లోనే ఆ జంటను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించిన రోజునే చంద్రశేఖర్‌ను వలంటీర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే చంద్రితను వారి బంధువుల గ్రామమైన దొరవారి సత్రంలో ఉంచారు. అక్కడే మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకు ఆ యువకుడు చంద్రితకు సెల్‌ఫోన్ తీసి ఇచ్చాడు. దీంతో ఆ సెల్‌ఫోన్ ద్వారా ప్రియుడు చంద్రశేఖర్‌కు అప్పుడప్పుడూ ఫోన్ చేసేది. 2022 జనవరి 11న మళ్లీ ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన రోజు మళ్లీ పోలీసులకు ఇరువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి పోలీసులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. ఈ నెల 20న కేవీబీపురం మండల పరిధిలోని తెలుగుగంగకాలువలో ఓ యువతి మృతదేహం లభించింది. ఆ మృతదేహం చంద్రితదే అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఆ యువతిని వైఎస్సార్‌సీపీ వారే హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని ప్రచారం చేశారు. అందులో భాగంగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి అండ్‌కో చంద్రిత తల్లిదండ్రులను ప్రలోభపెట్టి రాజకీయాలకు వాడుకున్నారు. దీంతో టీడీపీ ప్రలోభాలకు లొంగిన చంద్రిత తల్లిదండ్రులు వైఎస్సార్‌సీపీపై నిందలు వేశారు. వారం రోజులుగా ఈ శవరాజకీయాలతో ఉద్రిక్త వాతావరణానికి తెరలేపారు. ఇదే అదనుగా ఎల్లో మీడియా కూడా రెచ్చిపోయింది. అయితే పోలీసులు పుట్టుమచ్చలు చెప్పమని కోరగా, వారు చెప్పిన పుట్టుమచ్చలకు మృతదేహానికి ఉండే పుట్టుమచ్చలకు పొంతన లేకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.
నేను బతికే ఉన్నా
ఈ తంతు ఇలా సాగుతుండగా, వెళ్లిపోయిన ప్రేమ జంట తమను ఎవరూ చంపలేదని, తాము బతికే ఉన్నామంటూ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. తొందరలోనే గ్రామానికి చేరుకుంటామని వారు వీడియో ద్వారా తెలిపారు. దీంతో వాస్తవాలు తెలుసుకోకుండా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న టీడీపీ, జనసేన నాయకులు తెల్లమొహం వేసుకుని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.
టీడీపీ నాటకానికి తెరపడింది
గత వారం రోజులుగా టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకానికి తెరపడిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గాదిపాకుల కిరణ్ అన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ప్రజాదరణ మెండుగా ఉండడంతో, బొజ్జల సు«దీర్‌రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారన్నారు. అయితే కాలువలో దొరికిన యువతి శవం ఎవరిదో, అందులో టీడీపీ పాత్ర ఏమిటో పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని తేల్చాలని అన్నారు. వారం రోజులుగా వైఎస్సార్ సీపీపై చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
ధర్మం గెలిచింది
చంద్రిత తల్లిదండ్రులకు రూ.5లక్షలు ఇచ్చి ప్రలోభపెట్టానని బొజ్జల సుదీర్‌రెడ్డి ఆరోపించారు. అయితే చంద్రిత బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు తల్లిదండ్రుల చేత చెప్పించడం అత్యంత దుర్మార్గం. రెండు రోజులు ముందు టీడీపీ నేత సంపత్ ఆత్మహత్య చేసుకుంటే, వైఎస్సార్‌సీపీ నాయకులే చంపేశారంటూ ప్రచారం చేశారు.
అయితే పోలీసులు వెంటనే స్పందించి అతని చావుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. అయినా ఆగకుండా యాదవ సంఘంతో సంప్రదించి ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్కిట్ కళాశాల పతనానికి టీడీపీ కారణమైతే మూసేశారంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరికి ధర్మం గెలిచింది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రజల సమస్యలపై పోరాడాలి.
– అంజూరు తారక శ్రీనివాసులు, చైర్మన్, శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి
Comments
Please login to add a commentAdd a comment