సాక్షి, అమరావతి: తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని ప్రతిచోటా చెప్పుకునే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు వింత భాష్యం చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ గుర్తులేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ తన క్షుద్ర రాజకీయాన్ని జొప్పించి విద్వేషాలు రగిలించడానికి ఆయన పడుతున్న తాపత్రయం చూసి రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా ఒకవైపు ప్రభుత్వం పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోటీకోసం కాలుదువ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందుకోసం పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏకంగా మేనిఫెస్టో విడుదల చేసి మరీ తాను గ్రామాలను ప్రశాంతంగా ఉండనిచ్చేదిలేదని పరోక్షంగా చెప్పడంతో టీడీపీ నాయకులే నోరెళ్లబెడుతున్నారు. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను
గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యమా?
గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, స్థానికుల మధ్య విభేదాలను నివారించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ల నుంచి పంచాయతీల్లో పార్టీ గుర్తులేకుండా ఎన్నికలు జరుపుతున్నారు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు గౌరవిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధానం అమలైంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా దీన్ని గౌరవించాల్సిందే. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ, చంద్రబాబు దీన్ని ఉల్లంఘిస్తూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై సొంత పార్టీ సహా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజూ రాజ్యాంగ పరిరక్షణకు నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు.. మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా దానికి తూట్లు పొడిచారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల గ్రామాల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి బరితెగింపు చర్యలకు దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇద్దరు ఐఏఎస్‌లపై చర్యలొద్దు
చంద్రబాబు మేనిఫెస్టోకు విలువ ఉందా?
చంద్రబాబు చెప్పే మాటలు, విడుదల చేసే మేనిఫెస్టోలకు ఎప్పుడూ విలువలేదు. 2014 ఎన్నికల్లో 600కి పైగా అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన.. వాటిని పక్కనపెట్టి అడ్డగోలుగా పరిపాలన చేయడంతో 2019 ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలు, అలాంటి మేనిఫెస్టోనే విడుదల చేయడం వెనుక స్వార్థ రాజకీయమే తప్ప ప్రజలపై చిత్తశుద్ధిలేదని విశ్లేషకులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే ముందుగానే దాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు ఒక వాదనను సిద్ధంచేసుకున్నారు. తెర వెనుక రాజకీయాలు ఉన్నా ఎన్నికలు మాత్రం గుర్తుల్లేకుండా జరుగుతాయి కాబట్టి చట్టం ప్రకారం ఇవి పార్టీ రహిత ఎన్నికలే. అలాంటి ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ద్వారా చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తారంట!
పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడమే ఒక వింత అయితే, దాన్ని తలదన్నేలా.. పంచాయతీ పోరులో గెలిస్తే 60 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని చంద్రబాబు అనడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనిచ్చిన ఈ హామీపై ఇప్పుడు తెగ సెటైర్లు పేలుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న మనమెలా వ్యాక్సిన్ ఇస్తాం? అదీ పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే? అని ఆ పార్టీ నాయకులే జుట్టు పీక్కుంటున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో. కానీ, కొన్ని పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలిచినంత మాత్రాన వ్యాక్సిన్ ఇవ్వడం ఎలా సాధ్యమో అర్థంకాక రాజకీయ పండితులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇవేకాక.. ప్రతి ఒక్కరికీ వంద గజాల్లో రూ.3 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ఎడాపెడా వాగ్దానాలు చేసిపారేశారు. పంచాయతీల్లో గెలిస్తే రాష్ట్రంలో తమ ప్రభుత్వమే వచ్చేస్తుందనే స్థాయిలో చంద్రబాబు మాట్లాడుతుండడంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. తమ అధినేతకు ఏదో అయిందని.. లేకపోతే ఈ హామీలేంటని వారు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment