TDP Conspiracy: Chandrababu And Atchannaidu Audio Call Leaked - Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్‌..

Published Tue, Jan 18 2022 8:07 AM | Last Updated on Tue, Jan 18 2022 10:26 AM

TDP Conspiracy: Chandrababu And Atchannaidu Audio Leaked - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల్లో ఆదరణ కోల్పోయి... తెలుగుదేశం పార్టీ పాతాళానికి కూరుకుపోయిన తరుణంలో ఎటూ పాలుపోని చంద్రబాబు రాద్ధాంతాలనే నమ్ముకున్నారు. అలాగైనా తానున్నానని ప్రజలకు చూపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారనేది ఇటీవలి సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లా  వెల్దుర్తిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన ఓ హత్యను రాజకీయం చేయడానికి ఆయన పన్నిన కుట్ర ఆడియో లీకవటంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటనను పెద్ద గొడవగా ఎలా చిత్రీకరించాలో.. రాష్ట్ర వ్యాప్త అంశంగా ఎలా చూపాలో అని చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇతర నేతలు టెలి కాన్ఫరెన్స్‌లో చేసుకున్న వ్యాఖ్యలన్నీ ఈ ఆడియోలో ఉన్నాయి.

మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో చంద్రబాబు మాట్లాడుతుండగా ఇంకా పలువురు నేతలు పాల్గొన్న టెలికాన్ఫరెన్స్‌ అది. ఈ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ‘‘వెంటనే హత్య జరిగిన చోటుకు వెళ్లిపోవాలి!! అందరూ వెళ్లిపోవాలి..!! తిరుగుబాటు చేయాలి!. అక్కడి నుంచి ఇది పెద్ద ఇష్యూ అయిపోవాలి. మొత్తం స్టేట్‌ ఇష్యూగా మారిపోవాలి’’ అంటూ బ్రహ్మానందరెడ్డికి, ఇతర నేతలకు ఫోన్‌లో నూరిపోశారు.

తాను మామూలుగా కాకుండా వంద కార్లతో బయలు దేరుతున్నానని, తమ వాళ్లందరినీ రమ్మన్నట్లు బ్రహ్మానందరెడ్డి చంద్రబాబుకు చెబుతుండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ‘‘ఆంజనేయులు గారు.. మీరు కూడా 100–150 కార్లతో వెళ్లండి. నియోజకవర్గ స్థాయి వాళ్లకే కాకుండా సెకండ్‌ క్యాడర్‌ వాళ్లనీ రమ్మనండి. కిందవాళ్లు వస్తే ఇంకా బాగా ఉంటుంది.. ఈ దెబ్బతో విషయం అటో ఇటో తేలిపోతుంది’’ అంటూ మధ్యలో ‘తమరు కూడా వెళితే బాగుంటుంది సర్‌’ అని చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు ‘‘అదే ఆలోచిస్తున్నా’’ అంటూ ఆ నిమిషంలో వెల్దుర్తి టూర్‌ను ఖరారు చేసేశారు. తాను బయల్దేరుతున్నానని చెప్పగా బ్రహ్మానందరెడ్డి తాను 100 కార్లతో స్వాగతం పలికి మిమ్మల్ని తీసుకెళతానని ఫోన్‌లో చెప్పారు.

ఇంత రాజకీయమా? 
మారుమూల గ్రామంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాష్ట్ర వ్యాప్త సమస్యగా, శాంతిభద్రతల అంశంగా మార్చేందుకు చంద్రబాబు పరివారం ఎంత ప్రణాళిక రచించిందో ఫోన్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ బయటపెట్టింది. అన్నట్టుగానే చంద్రబాబు మందీమార్బలంతో అక్కడకు వెళ్లి తొడ గొట్టడం, వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా దుర్భాషలాడడం, చివరికి మృతి చెందిన చంద్రయ్య పాడె మోసి సానుభూతి కోసం పడిన తపనను ఎల్లో మీడియా గొప్పగా చూపడం.. పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగాయని తెలిశాక ఆశ్చర్య  పోవటం సామాన్యుల వంతయింది.

నరసరావుపేటలో ఎదురుదాడి.. 
ఆ తర్వాత రెండురోజులకే నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహం మాయమైన ఘటనలో తప్పు తమ వైపే ఉన్నా ఎదురుదాడికి దిగి తమపై దాడి చేశారని రాద్ధాంతం చేశారు తెలుగుదేశం శ్రేణులు. నిజానికి అక్కడ మాయమైంది వైఎస్సార్‌ విగ్రహం. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ సమయంలో అక్కడ తిరిగిన వారిని పోలీసులు అరెస్టు చేస్తే.. దానిపై అక్కడి టీడీపీ నేతలంతా గొడవకు వెళ్లడం గమనార్హం. విగ్రహాన్ని మాయం చేసింది కాకుండా అందుకు బాధ్యుల్ని అరెస్టు చేయడాన్ని అడ్డుకుని, అక్కడి టీడీపీ ఇన్‌చార్జి అరవింద్‌బాబు నానా యాగీ చేశారు.

చివరకు తమపై పోలీసులు దాడి చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా గగ్గోలు మొదలెట్టారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అసలు విషయాన్ని వదిలేసి తమ నాయకుడిపై దాడి చేశారంటూ హడావుడి చేశారు. ఇలా ప్రతి సందర్భాన్ని రాజకీయం చేసి ప్రజల దృష్టి తమపై పడేలా చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చిన్న గొడవను పెద్దది చేయడం, మీడియా సమావేశాలు పెట్టి దాన్ని నేరుగా సీఎం జగన్‌కు లింకు పెట్టడం,  తమపై దౌర్జన్యాలు చేస్తున్నారంటూ  బురద జల్లడం బాబుకు నిత్యకృత్యమైపోయింది.

క్యేడర్‌ వినడం లేదనే...!
స్థానిక ఎన్నికలు, తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, చివరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణమైన భంగపాటుతో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబే స్వయంగా ఓడిపోవడంతో పార్టీపై క్యాడర్‌కు నమ్మకం పోయింది. ధర్నాల వంటి కార్యక్రమాలకు పిలుపునిస్తే పార్టీ నాయకులు కూడా పాల్గొనడంలేదు. బాబు ఎంత బతిమాలినా పార్టీ ఇన్‌చార్జిలు నియోజకవర్గాలకు వెళ్లడంలేదు.

మరోవైపు లోకేష్‌కు, సీనియర్‌ నాయకులకు పొసగకపోవడంతో అనేక సమస్యలొస్తున్నాయి. దీంతో ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో కొంత హడావుడి తప్ప టీడీపీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో పూర్తిగా దిగజారిపోయిందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అందుకే చంద్రబాబు రాద్ధాంతాలపై దృష్టిపెట్టారనేది వారి మాటగా వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement