సాక్షి, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో గతంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు కనుమరుగైంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆ పార్టీని వీడిన తర్వాత దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు సైతం కరువయ్యారు. గతంలో పొత్తుల కారణంగా ఇతర పార్టీలకు టికెట్ కేటాయించినా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీలో దింపేందుకు టీడీపీకి అభ్యర్థి కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోవడం గమనార్హం.
జిల్లాలో తెలుగు దేశం పార్టీ కనీస ఉనికి కూడా లేకుండా పోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1985లో డి.రామచంద్రారెడ్డి అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత 1989, 1994, 1999 వరకు వరుసగా మూడు సార్లు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఆవిర్భవించింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యేలు రాజీనామాతో జరిగిన 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమి చవిచూసిన ముత్యంరెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభంజనంలో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఇంతటి చరిత్ర ఉన్న టీడీపీకి ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితికి చేరుకుంది.
టీజేఎస్, సీపీఎం కూడా దూరమే
గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో దుబ్బాక టికెట్ కైవసం చేసుకున్న తెలంగాణ జన సమితి, అప్పుడు పోటీలో ఉన్న సీపీఎం ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ పొత్తులో భాగంగా దుబ్బాక అసెంబ్లీ టికెట్ టీజేఎస్‌కు దక్కింది. దీంతో మనస్తాపానికి గురైన ముత్యంరెడ్డి ఎన్నికల ముందు తమ అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా టీజేఎస్ నుంచి చిన్నం రాజ్‌కుమార్ పోటీలో నిలిచినా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ బీ ఫాంతో మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పోటీలో నిలిచారు. దీంతో పొత్తుల్లో టికెట్ తెచ్చుకున్న టీజేఎస్ అభ్యర్థి కన్నా.. బీజేపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నాగేశ్వర్‌రెడ్డి, టీజేఎస్ నుంచి పోటీ చేసిన చిన్నం రాజ్‌కుమార్‌లు టీఆర్‌ఎస్‌లో చేరగా.. అప్పుడు టీఆర్‌ఎస్ తరుఫున ప్రచారం చేసిన ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment