సాక్షి, తిరుపతి: విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు చల్లరాడం లేదు. అసెంబ్లీ, ఎంపీ టికెట్ ఆశించిన ఆశావాహలు.. సీట్లు దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.
టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరికో మద్దతు పలకమంటే తాను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించదని పేర్కొన్నారు.
తిరుపతి టికెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలొచిస్తారని నమ్ముతున్నానని అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన నేతలు అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఉన్నపళంగా పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదన్న సుగుణమ్మ.. తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment