సాక్షి, ఢిల్లీ: అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాంటి నాయకుడి కోసం జనసేనను.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన పవన్ కల్యాణ్ మొత్తానికి చావు తప్పి కన్ను లొట్ట బోయినంత పని చేశారు. ఢిల్లీ వేదికగా ఒకటిన్నర రోజులపాటు నడిపిన పొత్తుల డ్రామాకు ఎట్టకేలకు తెర దించారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ అతికష్టం మీద దొరకబుచ్చుకుని.. బీజేపీని ఎలాగోలా కూటమికి ఒప్పించారు. నాడు హోదా పేరు చెప్పి బయటకు వచ్చిన బాబు..నేడు కేసుల కోసం, కొడుకు కోసం మళ్లీ ఎన్డీఏలో చేరారు. అయితే ఈ పరిణామాలేవీ ఏపీలోని ‘అసలైన’ బీజేపీకి ఇప్పుడు సహించడం లేదు.
టీడీపీ-జనసేనలతో బీజేపీ పొత్తు కుదిరిందని.. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దని ఢిల్లీ నుంచి శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు తేల్చి చెప్పారు. అదే సమయంలో టీడీపీ తమ పాత మిత్రపక్షమేనని బీజేపీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. అధికారికంగా ఎన్ని సీట్లు తీసుకుంటామనేది అటు బీజేపీ.. ఇటు టీడీపీ ఇంకా ప్రకటించలేదు. ఈలోపు టీడీపీ నేతలు ఇస్తున్న లీకులతో అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీ అధిష్టానం గట్టిగానే రాజీ పడిందన్న విషయం స్పష్టమౌతోంది.
టీడీపీ లీకుల ప్రకారం.. బీజేపీ పోటీ చేయబోయే పార్లమెంట్ స్థానాలు
- అనకాపల్లి - CM రమేష్
- అరకు - కొత్తపల్లి గీత
- రాజమండ్రి - పురందేశ్వరీ
- ఏలూరు - సుజనా చౌదరీ
- హిందూపూర్ - పరిపూర్ణనంద
- రాజంపేట - కిరణ్‌కుమార్ రెడ్డి
అలాగే జనసేన పోటీ చేయబోయే సీట్లు:
- మచిలీపట్నం - బాలశౌరీ
- కాకినాడ - పవన్ కళ్యాణ్
వీటితో పాటు పొత్తులో భాగంగా అనూహ్యంగా.. కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతల్ని ఒప్పించినట్లు టీడీపీ పెద్దలు ఇప్పుడు ప్రచారానికి దిగారు. ఈ నెల 17 లేదా 18న తేదీల్లో టీడీపీ - జనసేన బహిరంగ సభ నిర్వహించి.. అక్కడి నుంచే బీజేపీతో కలిసి అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఆ మీటింగ్‌కు ప్రధాని మోదీ సైతం హాజరు అవుతారని.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
ముష్టి పడేశారా?
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు మరోసారి కన్నింగ్ రాజకీయం ప్రదర్శించారు. దీంతో.. కేవలం సింగిల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలే బీజేపీకి దక్కబోతున్నాయని తెలిసి ఏపీ ఒరిజినల్ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని తాకట్టు పెట్టారంటూ పార్టీ చీఫ్, చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరిపై మడిపడుతున్నారు. పైగా సీట్ల తగ్గింపులో చంద్రబాబు కుట్ర ఫలించిందని.. బీజేపీలో ఉన్న తన అనుచరులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో ఈ తతంగం అంతా నడిపించారని ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆమె మాట వింటారని అనుకోలేదు!
టీడీపీతో పొత్తు విషయంలో మొదటి నుంచి పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలకు సానుకూల నివేదికలే ఇస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది. అయితే అధిష్టానంపై నమ్మకం.. అంతకు మించి పురంధేశ్వరి మాటలు చెబితే ఎవరు వింటారని ఏపీ బీజేపీ నేతలు మొదటి నుంచి గట్టిగానే అనుకుంటూ వచ్చారు. ఆ నమ్మకంతోనే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెబుతూ వచ్చారు. ఈలోపు ఎనిమిది సీట్లకే పరిమితం కాబోతున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
గతంలో ఇదే కూటమి తరఫున 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని.. ఇప్పుడు అంతకు మించి తీసుకోకుండా ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం ఏంటని రగిలిపోతున్నారు ఏపీ బీజేపీ నేతలు. సీట్లు సాధించడంలో పురంధేశ్వరి ఘోరంగా ఫెయిల్ అయ్యారని.. ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏపీ బీజేపీ చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే ఆవేదననే ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు వాళ్లు ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment