ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే. ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకునే మరో నేత పంచన ఈ మధ్యే చేరారు. పచ్చ గూటిలో చేరగానే ఆ సీటు నాదే అంటూ ఖర్చీఫ్ వేసేశారు. అయితే అప్పటికే అక్కడున్న వాళ్ళు అధినేతకే వార్నింగ్ ఇచ్చారు. ఏమైందో ఏమో.. చంద్రబాబు ఆ నియోజకవర్గానికి వచ్చినపుడు కొత్తగా వచ్చిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ కనిపించలేదు. ఆ సంగతేంటో చూద్దాం..
ఒకప్పుడు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్ని శాసించారు. మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని నిర్ధారించుకుని కాషాయ తీర్థం తీసుకున్నారు. అక్కడా ఇమడలేక ఈ మధ్యనే తెలుగుదేశం గూటికి చేరారు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీలో చేరిన వెంటనే జిల్లా రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కావాలనే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నేతలందరికీ పార్టీ ఇచ్చారు. గుంటూరు సిటీలో వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. అయితే ఆయన సొంత నియోజకవర్గం అయిన సత్తెనపల్లిపైనే కన్నా ఫోకస్ పెట్టారు. తరచు సత్తెనపల్లి వెళ్ళడం, అక్కడి నేతలతో సమావేశం కావడాన్ని అప్పటికే అక్కడ కుమ్ములాడుకుంటున్న నియోజకవర్గ నేతలు గమనించి అలర్ట్ అయ్యారు.
కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు. కోడెల కుమారుడు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. తాజాగా మూడో కృష్ణుడు రావడంతో పాత నేతలిద్దరూ అలర్ట్ అయ్యారు. కన్నా సత్తెనపల్లి నుంచే పోటీ చేయబోతున్నారని, చంద్రబాబు తన పర్యటనలో ఈ విషయం స్పష్టం చేస్తారని ఆయన అనుచరులు నియోజకవర్గంలో హడావుడి చేయడం ఆరంభించారు. దీంతో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు మూడో కృష్ణుడికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.
కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. సత్తెనపల్లి సభలో కన్నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఆయన అనుచరులు డప్పు కొట్టినా అక్కడ మాత్రం పూర్తి రివర్స్‌లో జరిగింది. సత్తెనపల్లికి ముందు చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించినపుడు కన్నా లక్ష్మీనారాయణ అధినేత పక్కనే ఉన్నారు. కాని సత్తెనపల్లి రోడ్‌షోలో కాని.. సభలో కాని కన్నా కనిపించలేదు. ఆ పరిసరాల్లో ఎక్కడా ఆయన జాడే లేదు. సత్తెనపల్లి సభలో చంద్రబాబుకు ఇరువైపులా కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు దర్శనమిచ్చారు. కన్నాకు సీటు ప్రకటిస్తారనని అందరూ భావిస్తే ఆయనకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం, సభలో ప్రచార రథం కింద నిలబడి ఉండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
సత్తెనపల్లి రోడ్‌షో, సభలో చంద్రబాబు పక్కన కన్నా లేకపోవడానికి కోడెల శివరాం, వైవీ ఆంజనేయులే కారణమని వారిద్దరి వర్గీయులు చెబుతున్నారు. నాలుగేళ్లనుంచి పార్టీని మోస్తున్న తమను పక్కకు నెట్టి.. కొత్తగా వచ్చిన కన్నాకు సీటు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని చంద్రబాబుకే నేరుగా చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ వల్లనే చంద్రబాబు పక్కన కన్నాకు చోటు దొరకలేదని చెప్పుకుంటున్నారు. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ దక్కించుకుంటామే గాని.. కన్నాకు మాత్రం ఛాన్స్ ఇచ్చేది లేదని ఇప్పుడు వైరి వర్గాలు రెండూ ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే కన్నా వర్గీయులు మాత్రం కోడెల, వైవీ వర్గీయుల ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. చంద్రబాబు సత్తెనపల్లి పర్యటన మొత్తం కన్నా డైరెక్షన్‌లోనే జరిగిందంటున్నారు.
మంచి రోజులు కాకపోవడంతో కన్నా సత్తెనపల్లిలో చంద్రబాబు వాహనం ఎక్కలేదని చెబుతున్నారు. త్వరలో పార్టీ అధినేతే కన్నా పేరు ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సత్తెనపల్లికి చంద్రబాబు వచ్చినపుడు అనుకున్నదొకటైతే.. జరిగింది మరొకటి. ఇక ముందు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment