గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? | TDP Leaders And Activists Angry About Behavior Of Gandi Babji | Sakshi
Sakshi News home page

గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?

Published Thu, Aug 11 2022 7:34 AM | Last Updated on Thu, Aug 11 2022 7:40 AM

TDP Leaders And Activists Angry About Behavior Of Gandi Babji - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా ఎన్ని గొడవలున్నా శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటిగా కలుసుకుంటాం. అందుకు భిన్నంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు టీడీపీ నగర నేతలు. ప్రతి విషయంలోనూ విలువలకు ‘గండి’ కొట్టే సదరు టీడీపీ నేత... ఎమ్మెల్యే వాసుపల్లి ఇంట జరిగిన శుభకార్యంలోనూ రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే భగ్గుమంటున్నారు. శుభకార్యాల్ని కూడా రాజకీయం చేస్తే పార్టీ మనుగడ కష్టమవుతుందంటూ పంచాయితీని పెద్దల ముందుకు తీసుకెళ్లడంతో మరోసారి పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.
చదవండి: గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..

శుభకార్యానికి వెళ్లొద్దనడంతో... 
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కుమారుడి రిసెప్షన్‌ జరిగింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన వాసుపల్లికి ఆ పార్టీలోని అన్ని వర్గాల వారితో సత్సంబంధాలున్నాయి. దీంతో అందరికీ ఈ వేడుకకు ఆహ్వానం అందించారు. విషయం తెలుసుకున్న టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ వాసుపల్లి కుమారుడి రిసెప్షన్‌కు వెళ్లొద్దంటూ హుకుం జారీ చేశారు. ఎవరైనా ఈ వేడుకకు హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే మండిపడ్డారు. రాజకీయాలు రాజకీయాలే.. శుభకార్యాలు శుభకార్యాలే.. ఆయనెవరు మమ్మల్ని వెళ్లనివ్వొద్దని చెప్పడానికంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం చేస్తారో చూద్దామంటూ వేడుకలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న బాబ్జీ.. ఎవరైతే వాసుపల్లి ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారో వాళ్లని పార్టీకి సంబంధించిన అన్ని సోషల్‌ మీడియా గ్రూపుల నుంచి తొలగించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కడా లేని విధంగా ఇలాంటి కుటిల రాజకీయాలకు గండి బాబ్జీ ఆద్యుడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. లేనిపోని వ్యవహారాలపై ఆంక్షలు విధిస్తే.. పార్టీ గెలవడం మాట అటుంచితే మనుగడ కూడా కోల్పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది నేతలతో కలిసి పనిచేసినా.. ఈ తరహా నీఛమైన అనుభవం ఎదురవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భరత్‌ దృష్టికి పంచాయితీ  
గండి బాబ్జీ వ్యవహారాన్ని పార్టీ పెద్దల ముందుకు తీసుకెళ్లాలంటూ పంచాయితీని పార్టీ సీనియర్‌ నేత భరత్‌ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్జీ వైఖరిపై స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గండి బాబ్జీ వ్యవహారంపై ఆ పార్టీ మహిళ ఆవేదనకు సంబంధించిన ఆడియో ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది.

దాని సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...
‘‘బాబూ.. భరత్‌.. మీ తాత గారు మమ్మల్ని నియమించారు. అందరూ సమానమేననే ధోరణితో వెళ్లాం ఇన్నాళ్లూ. అన్ని పార్టీలూ సమానమేనని అనుకున్నాం. ఎన్నికల సమయంలో ఎలా గెలవాలనే ఆలోచనతో నిత్యం బాధలు పడి పనిచేసేవాళ్లం. కానీ ఏనాడూ ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు గండి బాబ్జీ వచ్చాక చుట్టాల దగ్గరికి వెళ్లొద్దంటారు.. పట్టాల దగ్గరికెళ్లొద్దంటున్నారు. వాసుపల్లి గణేష్‌కుమార్‌ మా బంధువు.

ఆ పెళ్లికి వెళ్తున్నాననీ.. ఎవరైనా వస్తున్నారా అని 34వ వార్డు గ్రూపులో మెసేజ్‌ పెట్టాను. అది తప్పు అని.. ఎవరూ పెళ్లికి వెళ్లొద్దని పీఏతో బాబ్జీ వార్నింగ్‌ ఇచ్చారు. అన్ని గ్రూపుల నుంచి నన్ను తొలగించేశారు. ఇది ఎంతవరకూ కరెక్ట్‌.? ఇలాంటి విలువల్లేని మనుషులా అనేది అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేమీ లేదు. పెళ్లిళ్లకు వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మా వ్యక్తిగతం. దాన్ని ఇలా రాజకీయం చేస్తారని అనుకోలేదు. గెలిచే వ్యక్తులైతే ఇలా విడదీసి పాలించరు.

ఇతను వచ్చాక కనీసం 50 మంది ముఖ్య కారకర్తలు పార్టీకి దూరమయ్యారు. పార్టీ గెలవాలనుకుంటున్నారో..? ఓడిపోవాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని నడిరోడ్డుపై ప్రెస్‌మీట్‌ పెట్టి నిలదీయాలని అనుకుంటున్నాను.’’ ఇలా.. ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గండి బాబ్జీ వ్యవహారంపై దక్షిణ నియోజకవర్గం టీడీపీ నేతల్లో ఇప్పటికే పూర్తి వ్యతిరేకత ఉంది.

నియంతలా వ్యవహరిస్తూ కేడర్‌ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ నుంచి చాలా మంది దూరమైపోతారన్న సంకేతాల్ని ఇప్పటికే పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న బుధవారం నగరానికి వచ్చారు. గండి బాబ్జీ వ్యవహారాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement