విజయవాడలో టీడీపీ నేతల రచ్చ రచ్చ | TDP leaders differences In Vijayawada | Sakshi
Sakshi News home page

కేశినేనిని చెప్పుతో కొట్టేవాడిని : బుద్దా వెంకన్న

Published Sun, Mar 7 2021 3:47 AM | Last Updated on Sun, Mar 7 2021 11:12 AM

TDP leaders differences In Vijayawada - Sakshi

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొండా ఉమా. చిత్రంలో టీడీపీ నేతలు నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్న

సాక్షి, అమరావతి బ్యూరో/మొగల్రాజపురం: విజయవాడలో టీడీపీ నేతల మధ్య కొన్నాళ్ల నుంచి రగులుతున్న ఆధిపత్య పోరుకు వర్గ విభేదాలు తోడు కావడంతో వ్యవహారం రచ్చకెక్కింది. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ మేయర్‌ అభ్యర్థి తండ్రి, ఎంపీ కేశినేని నానిపై నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మైనార్టీ నాయకుడు నాగుల్‌మీరాలు నిప్పులు చెరిగారు. వీరంతా శనివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి, కేశినేనిపై మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

నువ్వు పెద్ద తోపువా.. అయితే చూసుకుందాం రా..
ఓపిక నశించి ఈ రోజు మీడియా ముందుకొచ్చాం. కేశినేని నాని చంద్రబాబును ఏకవచనంతో ఇష్టానుసారం మాట్లాడాడు. అధిష్టానం నేనేనంటూ చిటికెలు వేసి చెప్పాడు. ఆరోజే నానిని చెప్పు తీసుకుని కొట్టేవాడిని. నువ్వేంటి? నీ స్థాయేంటి? నేనే పెద్ద హీరోనంటున్నావ్‌.. నువ్వెక్కడ హీరోవి? చూసుకుందాం రా.. చంద్రబాబు జోలికి వచ్చిన రోజే నీకు ఈ సవాల్‌ విసరాలి. వంగవీటి మోహన్‌ రంగా హత్య కేసులో ముద్దాయిని వన్‌టౌన్‌లో తిప్పుతున్నావ్‌. ప్రజలు ఓట్లేస్తారా? ఛీకొడ్తారు. ఏంటి నీకీ అహంకారం? నా కులం గురించి మాట్లాడుతున్నావ్‌. నీకు నీ కులంలోనే ఓట్లేయరే. సొంత ఇమేజితో గెలిచానంటావా? చంద్రబాబును, మమ్మల్నీ లెక్క చేయవు. నువ్వు పెద్ద తోపువా? తోపువైతే రా.. ఎక్కడైనా సెంటర్‌ చూసుకుందాం.. నువ్వో నేనో తేల్చుకుందాం. కనకదుర్గ గుడికి నీ ఇద్దరు కూతుళ్లను తీసుకుని రా.. చంద్రబాబును విమర్శించలేదని అమ్మవారి మీద ప్రమాణం చేయ్‌. మీడియా సాక్షిగా చెబుతున్నా. రేపు చంద్రబాబు ఆశీస్సులతో విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా.. ఈ రోజు నుంచి ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతా. 
    – బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ  

మాకు తెలియని స్థాయా నీది? నువ్వెవరికి తెలుసు? 
కేశినేనీ.. నువ్వు కులహంకారంతో మాట్లాడుతున్నావు. బలహీన వర్గాలంటే నీకు లెక్కలేదా? సైకిల్‌ గుర్తు లేకుండా నీకు ఒక్కడు ఓటేస్తాడా? నువ్వు పార్టీలోకి ఎప్పుడొచ్చావ్‌? 2013లో వచ్చావ్‌. మేం 1998 నుంచి ఉన్నాం. మేం కట్టుబానిసలమా? మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటున్నాం. మీ నాయకత్వం కింద మేం పని చేయాలా? మేం నాయకులం కాదా? నీ స్థాయి ఏమిటి? మాకు తెలియని స్థాయా నీది? నువ్వెవరికి తెలుసు? నిన్ను చూసి ఓట్లేయరు.. మమ్మల్ని చూసి వేస్తారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేయలేం. మీ చెప్పులు మోయాలా? ఇంకెన్నాళ్లు మోస్తాం? మోసే రోజులు పోయాయ్‌.  – నాగుల్‌ మీరా, మైనార్టీ నేత 

సత్తా ఉంటే రాజీనామా చెయ్‌.. 
నీకు నిజంగా సత్తా , గ్లామర్‌ ఉంటే రాజీనామా చెయ్‌. చంద్రబాబు ఫొటో లేకుండా, తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా ఇండిపెండెంట్‌గా గెలువు. అప్పుడు మేం రాజకీయాలను వదిలేసుకుని, ఊరు వదిలేసి వెళ్లిపోతానని సవాల్‌ చేస్తున్నా. నువ్వెంత అహంకారంతో మాట్లాడుతున్నావ్‌. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావ్‌. నువ్వు మోనార్క్‌వని గెలిచావా? పార్టీ టిక్కెట్టు మీద గెలిచావా? కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్లాలి? ఎటు వెళ్లాలి? ఎంపీ పిలిస్తే వెళ్లాలా.. లేక ఎమ్మెల్సీలో, మాజీ ఎమ్మెల్యేలో పిలిస్తే వెళ్లాలా? ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఆదివారం చంద్రబాబు విజయవాడ పర్యటనలో కేశినేని నాని ఉంటే మేం పాల్గొనం. లేదంటే ఆయన్ను అదుపులో పెట్టండి. నాని ఒంటెత్తు పోకడలు, అవమానకరమైన ప్రవర్తన, బీసీలను, కాపులను చులకనగా చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.  -బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement