కింజరాపు అచ్చెన్నాయుడు
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పదవికి పార్టీ అధినేత చంద్రబాబు ఎసరు పెట్టారు. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయన్ని తప్పించి మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చాప కింద నీరులా చాలాకాలం నుంచి వ్యాపంపజేశారు. తాజాగా క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం వస్తున్నట్లు చూపించి మహానాడులో అచ్చెన్నకు చెక్ పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఒంగోలులో శుక్రవారం రాత్రి జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.
అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రతిపాదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని, ఎక్కువ పదవులు ఇస్తోందని ఆయన చెప్పినట్లు తెలిసింది. జగన్ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీకి ఇవ్వాలని వెంకట్రావు చెప్పినట్లు తెలిసింది.
వ్యూహాత్మకంగానే..
ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ, తెలంగాణకు అధ్యక్షులను ఎన్నుకుంటారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం లాంఛనమైన ప్రక్రియే. మిగిలిన పదవులను ఎవరికివ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఇలాగే అచ్చెన్నాయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్న పార్టీ పరిస్థితి, లోకేశ్ నాయకత్వం పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి నుంచి ఆయన్ని లోకేష్ టార్గెట్ చేశారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ అచ్చెన్నాయుడిని లోకేష్ ఎక్కడికీ వెళ్లనివ్వలేదు. మీడియా సమావేశాల పైనా ఆంక్షలు విధించారు. దీంతో అచ్చెన్నాయుడు అప్పుడప్పుడు ప్రకటనలు మాత్రం విడుదల చేసేవారు. జిల్లాల పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకుని లోకేశే వెళ్లేవారు.
అన్ని రకాలుగా అచ్చెన్నాయుడిని పక్కన పెట్టేశారు. అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాలని చూశారు. ఇలా చేస్తే బీసీల్లో ఇంకా బలహీనమవుతామని చంద్రబాబు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు మహానాడు సందర్భంగా వ్యూహం ప్రకారం కళా వెంకట్రావు ద్వారా అచ్చెన్నకు చెక్ పెడుతున్నారు. లోకేశ్ కూడా పార్టీ నేతలు ఎక్కువ కాలం పదవుల్లో ఉండకూడదని మహానాడు ప్రాంగణంలోనే తేల్చి చెప్పారు. ఎక్కువ కాలం పదవులు పట్టుకుని వేళ్లాడితే కొత్త వాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని ఉద్దేశించే లోకేశ్ మాట్లాడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడు తర్వాత కొత్త వారికి అవకాశం పేరుతో అచ్చెన్నను పదవి నుంచి తప్పించి మరో డమ్మీ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. (క్లిక్: వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు)
Comments
Please login to add a commentAdd a comment