సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం కూడా టీడీపీ ఎమ్మెల్సీలు చిడతలతో భజనలు చేస్తూ, ఈలలు వేస్తూ గలాటా సృష్టించారు. చైర్మన్ మోషేన్‌రాజు ఎంత వారిస్తున్నా.. భజనలు చేసే వారు సభ నుంచి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశిస్తున్నా వారు అదే తీరున వ్యవహరించారు. దీంతో ఎనిమిది మందిని సస్పెండ్ చేసేందుకు మంత్రి కన్నబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్ వారిని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో.. దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్, కేఈ ప్రభాకర్, రాజనర్శింహులు, దువ్వారపు రామారావు, మర్రెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరంతా బయటకు వెళ్లిపోవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వారు సభలోనే రాద్ధాంతాన్ని కొనసాగించారు. దీంతో.. చిడతలు, ఈలలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మోషేన్‌రాజు మార్షల్స్‌ను ఆదేశించారు.
చైర్మన్‌తో వాదులాట..
తమ సస్పెన్షన్ వ్యవహారంలో చైర్మన్ వైఖరిని తప్పుపడుతూ లోకేశ్ సహా మరికొందరు టీడీపీ సభ్యులు ఆయనతో వాదులాటకు దిగారు. ఇదే సమయంలో దీపక్‌రెడ్డి తమ చుట్టూ ఉన్న మార్షల్స్‌ను తోసుకుంటూ చైర్మన్ పోడియం మెట్లు ఎక్కేందుకు యత్నించగా మోషేన్‌రాజు మండిపడ్డారు. లోకేశ్ ప్రవర్తన బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం.. మార్షల్స్ సస్పెండ్ అయిన వారిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. అయినా కూడా అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు మరో గేట్ నుంచి తిరిగి సభలోకి వచ్చి ఆందోళన కొనసాగించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మరోవైపు.. అప్పటిదాకా తన సీటులోనే కూర్చుని ఉన్న టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సభలో ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత లోకేశ్ మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలూ వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారిని బయటకు తీసుకెళ్లకుండా మార్షల్స్ తాత్సారం చేయడంపై మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రజా సమస్యల కోసం కాదు, సస్పెన్షన్ కోసమే..
సస్పెండ్ ప్రక్రియ అనంతరం చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడానికే సభకు వచ్చారుగానీ, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదన్నారు. విచిత్రంగా తమను సస్పెండ్ చేయమని వారు అడుగుతున్నారని, కానీ.. సస్పెండ్ చేయకూడదని బుధవారం వరకూ ఓపిక పట్టామన్నారు. అనంతరం మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. మండలి స్థాయిని టీడీపీ దిగజార్చిందంటూ తప్పుపట్టారు. పెద్దల సభలో ఇంత చిల్లరగా గలాటా చేయడం దురదృష్టకరమని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సభకు లోకేశ్ లాంటి వారు వచ్చాక ఇది దొడ్డిదారి సభలా ముద్రపడిపోయిందని చెప్పారు.
మండలి అంటే చాలా గౌరవంగాను, హుందాగాను ఉండాలని.. కానీ అటువంటి సభా మర్యాదను టీడీపీ సభ్యులు మంటగలిపి సభ ఔన్నత్యాన్ని దిగజార్చారన్నారు. వారి ప్రవర్తనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చివరికి.. గోవింద నామాలను కించపరిచారన్నారు. బయటకు వెళ్లి ఏం చెప్పినా ప్రజలు నమ్మడంలేదు కాబట్టి ఈ సభను ప్రచారం కోసం వినియోగించుకోవాలని చూశారని మంత్రి అవంతి అన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ స్థానంలో ఉండడం ఇష్టంలేనట్లుగా వారి ప్రవర్తన ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సీ రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాధవ్‌రావు, అరుణ్‌కుమార్, రవీంద్రబాబు, భరత్, గోపాలరెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. సస్పెన్షన్‌కు ముందు టీడీపీ ఎమ్మెల్సీలు ‘మా భజన బాగుందా.. మీది బాగుందా’ అంటూ నినాదాలు చేస్తుండగా, మిగిలిన సభ్యుల వైపు నుంచి వీరిపై రూ.500 నోటు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment