tdp searching candidates for panchayat elections - Sakshi
Sakshi News home page

రండి బాబూ..రండి!

Published Fri, Jan 29 2021 12:01 PM | Last Updated on Fri, Jan 29 2021 2:10 PM

TDP Search For Candidates In Panchayat Elections - Sakshi

రండి బాబూ రండి.. పంచాయతీ  ఎన్నికల్లో పోటీకి రండి.. నామినేషన్‌ పత్రాలు మావే. పత్రాలు భర్తీ చేసేది మేమే.. నామినేషన్‌ ఫీజులూ మేమే చెల్లిస్తాం.. మీరు పోటీ మాత్రమే చేయండి.. అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆఫర్లు ప్రకటిస్తూ బతిమలాడుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ  తాజా పరిస్థితి ఇది. టీడీపీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ నేతలు వెతుకులాట మొదలు పెట్టారు.

సాక్షి ప్రతినిధి కడప: పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలలో అభ్యర్థులను పోటీలో నిలిపి అధికార పార్టీ అభిమానులను ఇరుకున పెట్టాలని టీడీపీ అధిష్టానం ఆ పార్టీ జిల్లా నేతలకు హుకుం జారీ చేసింది. దీంతో ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఉన్న ఒకరిద్దరు కార్యకర్తలను ఎన్నికల్లో పోటీ చేయాలంటూ వేడుకుంటున్నారు. వారు కాదు...కూడదంటూ ముఖం చాటేస్తుండడంతో నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మీరు పోటీకి ముందుకు వస్తే నామినేషన్‌పత్రాలు తామే తెస్తామని..వాటిని తామే భర్తీ చేస్తామని... చివరికి నామినేషన్‌ ఫీజులు కూడా తామే చెల్లిస్తామని.. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ బతిమలాడుకుంటున్నారు. అయితే  వీటితోపాటు ఎన్నికల్లో ఖర్చయ్యే మొత్తాన్ని సైతం మీరే చెల్లిస్తే పోటీలో నిలబడతామని ఉన్న అరకొర టీడీపీ కార్యకర్తలు తేల్చి చెబుతుండడంతో  టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధిష్టానం చెప్పిన మేరకు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎలా నిలబెట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం కొన్ని స్థానాల్లో అయినా అభ్యర్థులను పోటీలో నిలిపి చేతులు దలుపుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. చదవండి: పంచాయతీ: మమ్మల్ని బలి చేస్తారా!

రాష్ట్రంతో పాటు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. దీంతో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున  లబ్ధి పొందారు. ఈ పరిస్థితుల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులకే మద్దతు పలుకుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుతో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే  పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో మొదటి విడతలో బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ ఆ పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో క్యాడర్‌ అధికార పార్టీలో చేరిపోయింది. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం

ఉన్న అరకొర మంది కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి మద్దతు పలికే పరిస్థితి కానరావడం లేదు. మైదుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆ నియోజకవర్గానికి దాదాపుగా దూరమయ్యారు. ఎన్నికలు పూర్తయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ మొత్తం కాలంలో ఆయన పట్టుమని మూడుసార్లు కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి కార్యకర్తలు ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. గెలిచిన అభ్యర్థులకు డబ్బులు ఇస్తానంటూ సుధాకర్‌ యాదవ్‌ ఆఫర్లు ప్రకటించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయినా పోటీకి ఆ పార్టీ కార్యకర్తలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్‌ రాజశేఖర్‌ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.

నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు రితిష్‌కుమార్‌రెడ్డిలు గడిచిన రెండేళ్ల కాలంలో ఒకటి, రెండు సార్లు మినహా నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు లేవు. దీంతో ఆ  పార్టీ క్యాడర్‌ దాదాపుగా అధికార పార్టీలో చేరిపోయింది. ఉన్న ఒకరిద్దరు రెండవ శ్రేణి నేతలు పార్టీకి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసే వారు కనిపించడం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పార్టీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఉన్నారు. గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీనియర్‌ నేతలు లింగారెడ్డి, ఇప్పటికే ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వరదరాజులరెడ్డిలు పంచాయతీ ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా మొక్కుబడిగానే వ్యవహరిçస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో పార్టీ క్యాడర్‌ చెల్లాచెదురైంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో ఆ పారీ మద్దతుతో పోటీ చేసే వారు  కానరావడం లేదు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement